అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే తలసాని డిమాండ్

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే తలసాని డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. పేదలు, నిరుద్యోగుల ఆకలి తీర్చేందుకు అప్పటి సీఎం కేసీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇందిరమ్మ పేరుతో మార్చాలని చూస్తోందని విమర్శించారు. 

150 క్యాంటీన్లలో ఇప్పటికే 20 మూతపడినా పట్టించుకోవడం లేదన్నారు. కొత్త కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోవచ్చని, కానీ అన్నపూర్ణ పేరు మార్చడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని అదే పేరుతో కేసీఆర్ కొనసాగించలేదా అని ప్రశ్నించారు.