
న్యూఢిల్లీ: ఆర్థిక నేరస్తులకు సంబంధించి హోం అఫైర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సిఫారసులు చేసింది. కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరస్తులకు చేతి సంకెళ్లు వేయకూడదని తెలిపింది. రేప్, మర్డర్ వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారితో కలపకూడదని చెప్పింది. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని ప్యానెల్.. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ ఎస్ ఎస్– 2023)కు మార్పులు చేయాలని కోరింది. బీఎన్ ఎస్ ఎస్ 2023 లోని క్లాజ్ 43 (3 ).. రేప్, మర్డర్, యాసిడ్ అటాక్, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలు చేసినప్పుడు మాత్రమే చేతి సంకెళ్లు వేయాలని చెబుతుందని కమిటీ పేర్కొంది.
కస్టడీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటేనే పోలీసుల భద్రత రీత్యా మాత్రమే వాటిని ఉపయోగించాలని అంది. ఆర్థిక నేరాలను ఈ కేటగిరీలో కలపకూడదని వెల్లడించింది. అందువల్ల క్లాజ్ 43 (3)కు సవరణ చేపట్టి ఆర్థిక నేరాలు అనే పదాన్ని తొలగించాలని అభిప్రాయపడింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్-–1898 కు బదులుగా బీఎన్ ఎస్ ఎస్–2023ని తీసుకొచ్చారు. ఈ బిల్లును లోక్ సభలో ఆగస్టు 11న, రాజ్యసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
ALSO READ : ఇల్లు కొనేముందు ఇవి గమనించండి