వైట్ బాల్ క్రికెట్‌‌లో భువీ లాంటోడు లేడు

వైట్ బాల్ క్రికెట్‌‌లో భువీ లాంటోడు లేడు

ఇంగ్లండ్‌‌తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌‌లో అదరగొట్టిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. వన్డే సిరీస్‌లోనూ సత్తా చూపిస్తున్నాడు. గాయంతో పలు కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌‌కు దూరమైనప్పటికీ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించడం ద్వారా తనలో పదును తగ్గలేదని భువీ నిరూపించుకున్నాడు. అందుకే ప్రస్తుత టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ అత్యంత నైపుణ్యం కలిగిన బౌలర్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మెచ్చుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌‌లో వరల్డ్‌‌లో అత్యంత కచ్చితత్వంతో బంతులు వేస్తున్న బౌలర్ భువీయేనని, అతడి బౌలింగ్‌‌లో వేరియేషన్స్ అద్భుతమని కొనియాడాడు. 

‘ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో వైట్ బాల్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడు. అతడి ప్లేస్‌‌లో మరో బౌలర్‌‌ను ఊహించలేం. 80 మైళ్ల వేగంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే నేర్పు భువీ సొంతం. ఔట్ స్వింగర్లు, ఇన్ స్వింగర్లు, కట్టర్లు ఏది వేసినా పర్ఫెక్ట్‌‌గా ఉంటుంది. యార్కర్లు, బౌన్సర్లు కూడా వేయగలగడం అతడికి ప్లస్ పాయింట్. బ్యాట్స్‌మన్‌ను నిలదొక్కుకోకుండా చేసేందుకు భువీ బౌన్సర్లను కూడా సంధిస్తాడు. ఆ వేగంతో బంతిని స్వింగ్ చేస్తూ, వివిధ రకాల వేరియేషన్స్‌తో కచ్చితత్వంతో బంతులు వేయడం చాలా పెద్ద విషయం. అతడి నుంచి ఇలాంటి పునరాగమనాన్నే అందరూ కోరుకున్నారు’ అని వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.