తప్పులు జరిగినయ్​ రిపీట్​ కానియ్య .. కార్యకర్తలను కాపాడుకుంటం: కేసీఆర్​

తప్పులు జరిగినయ్​ రిపీట్​ కానియ్య ..  కార్యకర్తలను కాపాడుకుంటం: కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: పార్టీలో తప్పులు జరిగాయని, వాటిని రిపీట్​కానివ్వబోనని బీఆర్ఎస్​ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. లోక్​సభ సన్నాహక సమావేశాల్లో మాట్లాడిన, రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు వెల్లడించిన కార్యకర్తలతో కేసీఆర్​ నిత్యం ఫోన్​లో మాట్లాడుతున్నారు. సమీక్ష సమావేశాల్లో  వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ప్రతి ఒక్కటీ రికార్డు చేస్తున్నామని, ప్రతి ఒక్కరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి చెప్తున్నారు. 

రెండు వారాలుగా కార్యకర్తలతో కేసీఆర్​ ఫోన్​లో మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్​ఎస్​ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తున్నదో అడిగి తెలుసుకుంటున్నారు. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరిందని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడం, అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామని కార్యకర్తలతో కేసీఆర్​ చెప్తున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సాగునీటి వసతుల కల్పన, సబ్బండ వర్గాల సంక్షేమం కోసమే పరితపించామని, ఈ క్రమంలో పార్టీకి వెన్నెముకగా ఉన్న కార్యకర్తలను పట్టించుకోలేదన్నది నిజమేనని ఆయన ఒప్పుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ప్రక్షాళన చేస్తామని, ఫిబ్రవరి నుంచి తాను తెలంగాణ భవన్​లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు ఫోన్​లో కేసీఆర్​ చెప్పినట్లు బీఆర్​ఎస్​ వర్గాల ద్వారా తెలిసింది. 

60 నియోజకవర్గాల నేతలతో..

కేసీఆర్​ఇప్పటికే 60 నియోజకవర్గాలకు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో ఫోన్​లో మాట్లాడారని బీఆర్ఎస్​ నేతలు చెప్తున్నారు. ప్రతి రోజు పది మంది కార్యకర్తల వరకు ఆయన ఫోన్లు చేసి పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారని అంటున్నారు. లోక్​సభ సన్నాహక సమావేశాల్లో వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు ఇంకా క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తున్నది.. పార్టీ ప్రక్షాళనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. గ్రామ స్థాయి కమిటీలతో పాటు అన్ని అనుబంధ కమిటీలు వేస్తామని కేసీఆర్​ చెప్పినట్లు బీఆర్​ఎస్​ వర్గాలు తెలిపాయి.  

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు వేస్తామని, పార్టీ పొలిట్​బ్యూరోను పునరుద్ధరిస్తామని.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్​ ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నదని కొందరు కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారని..  ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్​ ధైర్యం చెప్పినట్లు బీఆర్​ఎస్​ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఆఫీస్​ కేంద్రంగా ఎప్పుడూ సమావేశాలు, ట్రైనింగ్​క్లాసులు ఉంటాయని.. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని కేసీఆర్​ అన్నట్లు సమాచారం.