ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ క్లైమాక్స్‌కు చేరుకుందని.. అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం నుంచి వైదొలగాలని చూస్తున్నారనే వార్తల మధ్య గల్ఫ్ దేశాలు రంగంలోకి దిగాయి. ఇరాన్ పూర్తిగా లొంగిపోయే వరకు, అక్కడి పాలనలో మార్పు వచ్చే వరకు యుద్ధాన్ని ఆపవద్దని సౌదీ అరేబియా, యూఏఈ వంటి అమెరికా మిత్రదేశాలు ట్రంప్‌కు విన్నవిస్తున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని కేవలం బలహీనపరచడం సరిపోదని, ఆ దేశపు మత గురువుల పాలనను శాశ్వతంగా దెబ్బతీసేందుకు ఇది ఒక చారిత్రక అవకాశమని ఈ దేశాలు వాషింగ్టన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.
యుద్ధం ప్రారంభంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అలిగిన గల్ఫ్ దేశాలు.. ఇప్పుడు మాత్రం ఇరాన్‌ను వదిలిపెట్టవద్దని కోరుతుండటం గమనార్హం. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. కేవలం గగనతల దాడులతో సరిపెట్టకుండా, ఇరాన్‌పై నేరుగా భూతల దాడి చేయాలని యూఏఈ ట్రంప్‌ను కోరుతోంది. కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు గనుక యుద్ధాన్ని మధ్యలోనే ఆపేస్తే.. ఇరాన్ మళ్లీ పుంజుకుంటుందని, అది అరబ్ దేశాల భద్రతకు ఏమాత్రం మంచిది కాదని సౌదీ అరేబియా వాదిస్తోంది.
మరోవైపు ఇరాన్‌తో దశాబ్దాలుగా మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్, ఖతార్ వంటి దేశాలు మాత్రం దౌత్యపరమైన పరిష్కారానికే మొగ్గు చూపుతున్నాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గల్ఫ్ మిత్రదేశాలన్నీ ఇరాన్‌పై పోరాటంలో ఏకతాటిపై ఉన్నాయని ప్రకటించారు. సౌదీ, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్.. ఇలా ప్రతి దేశం ఇరాన్ దూకుడును అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయని మీడియాతో అన్న సంగతి తెలిసిందే. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా గల్ఫ్ దేశాల ఆలోచనలు, అమెరికా వ్యూహాలు ఒకే దిశలో ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
►ALSO READ | ఇరాన్ సంచలన నిర్ణయం: అమెరికా-ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ.. ఈ దేశాల నౌకలకి మాత్రమే ఎంట్రీ..!
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచే ఇరాన్‌పై దాడులు జరుగుతున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా గత కొన్ని రోజులుగా ఈ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలు అమెరికాను యుద్ధం కొనసాగించమని కోరుతున్నప్పటికీ, వారు నేరుగా ఈ పోరులో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ట్రంప్ గనుక గల్ఫ్ దేశాల విన్నపాన్ని మన్నించి యుద్ధాన్ని పొడిగిస్తే, అది ఇరాన్ పతనానికి దారితీస్తుందా లేక గల్ఫ్ ప్రాంతాన్ని మహా యుద్ధంలోకి నెడుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇరాన్ లొంగే వరకు పోరు సాగించాలన్న గల్ఫ్ దేశాల పట్టుదల ఇప్పుడు ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్‌కు అడ్డంకిగా మారేలా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ఈ వివాదం ఇంకెన్నాళ్లు సాగుతుందో వేచి చూడాల్సిందే మరి.
