ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడు: నెహ్రా

ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడు: నెహ్రా

న్యూఢిల్లీ: గతేడాది ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మళ్లీ బరిలోకి దిగలేదు. ఐపీఎల్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెడతాడని అనుకుంటే ఆ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. ఇంకొన్ని వారాల్లో ఎట్టకేలకు ఐపీఎల్ జరుగుతున్నందున ధోని మెరుపులను చూడటానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. మాహీ తన బ్యాటింగ్ విన్యాసాలతో తిరిగి టీమిండియా తలుపులు తడతాడని భావిస్తున్నారు. కొందరు సీనియర్ క్రికెటర్స్‌ కూడా మాహీ కమ్‌బ్యాక్‌పై విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ఈ విషయంపై స్పందించాడు. ఇప్పటికే ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడన్నాడు. అలాగే మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు.

‘ధోని ఇంటర్నేషనల్ కెరీర్‌‌కు రాబోయే ఐపీఎల్‌తో ఎలాంటి సంబంధమూ ఉంటుందని నేను అనుకోను. ఒవకేళ మీరే సెలెక్టర్, కెప్టెన్, కోచ్ అయితే.. ధోని చాలా ముఖ్యమైన విషయం అనుకుందాం. అతడు తన సత్తా మేర ఆడటానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఆ లిస్ట్‌లో ధోనీకి చోటిస్తా. నాకు ధోని గురించి తెలిసినంత వరకు అతడు ఇండియాకు తన చివరి మ్యాచ్ చాలా హ్యాపీగా ఆడేశాడు. ఎంఎస్‌కు కొత్తగా ప్రూవ్ చేయడానికేం లేదు. అతడు తన రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు కనుక మీడియా వాళ్లు దీని గురించి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి మైండ్‌లో ఏం ఉందో ధోని మాత్రమే చెబుతాడు. నాకు తెలిసి ధోని ఆట ఎప్పటికీ ముగిసిపోదు. మేం దీని గురించి ఇంతకుముందూ చర్చించాం. అతడికి టీమ్‌ను ఎలా నడిపించాలో తెలుసు. ఒక ప్లేయర్‌‌గా ఐపీఎల్‌ ధోనీ సత్తాతో ఏదైనా మార్పులు తెస్తుందనీ నేను భావించట్లేదు. అయినా ధోని సెలెక్షన్‌ను ఐపీఎల్‌ పెర్ఫామెన్స్‌తో అంచనా వేయడం సరికాదు’ అని నెహ్రా చెప్పాడు.