యోగీ జీ..మోడ్రన్ బట్టలు వేసుకోండి: హుస్సేన్ దల్వాయ్

యోగీ జీ..మోడ్రన్ బట్టలు వేసుకోండి: హుస్సేన్ దల్వాయ్

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ వివాదాస్పద కామెంట్లు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాషాయ దుస్తులు ధరించడం మానుకొని ఆధునిక దుస్తులు ధరించాలని అన్నారు. "ప్రతిరోజూ మతం గురించి మాట్లాడకండి, కాషాయ బట్టలు వేసుకోకండి. కొంచెం ఆధునికంగా మారండి. ఆధునిక ఆలోచనలను స్వీకరించండి" అని దల్వాయ్  సలహా ఇచ్చాడు.

వచ్చే నెలలో లక్నోలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు యోగీ రెండు రోజుల ముంబై పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే దల్వాయ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. యోగి మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకుపోకుండా సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేసుకుంటే మంచిదని దల్వాయ్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. అందుకే మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకుపోయే ప్రయత్నం మానుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని, అవి అభివృద్ధి చెందేలా వాతావరణాన్ని కల్పించాలని దల్వాయ్ సూచించారు.
 

మరిన్ని వార్తలు