ఆగస్ట్ మొదటి వారంలో దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్

ఆగస్ట్ మొదటి వారంలో దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్
  • హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు 

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఫస్టియర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఎప్‌సెట్ (బీటెక్) ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ఫేజ్ పూర్తయిన తర్వాత దోస్త్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ పరిధిలో 820 డిగ్రీ కాలేజీల్లో 3,76,956 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు మూడు విడతల అడ్మిషన్లలో 1,20,712 మంది విద్యార్థులు ఫస్టియర్‌లో చేరారు.

 ఎప్‌సెట్, నీట్ అడ్మిషన్లలో ఉన్న విద్యార్థులు..తాము కోరుకున్న కాలేజీలు, బ్రాంచ్‌లలో సీటు రాకపోతే డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటారు. ప్రస్తుతం ఎప్‌సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ఈ నెల 18న, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ 25 నుంచి ప్రారంభమై, 30న సీట్ల కేటాయింపు జరగనుంది. దీని తర్వాత దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల కానుంది. మరో ఫేజ్ అవసరమా అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. చివరి విడతలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుండగా.. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తెలంగాణ కాలేజీల్లో చేరే అవకాశం ఉంటుంది.