ఎట్టకేలకు ‘డబుల్ బెడ్రూం’ లబ్ధిదారుల ఎంపిక..బాల్కొండలో ఉత్కంఠ మధ్య  లక్కీ డ్రా పూర్తి

 ఎట్టకేలకు ‘డబుల్ బెడ్రూం’ లబ్ధిదారుల ఎంపిక..బాల్కొండలో ఉత్కంఠ మధ్య  లక్కీ డ్రా పూర్తి

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయ అభ్యంతరాలతో వాయిదా పడిన డబుల్‌‌‌‌ బెడ్రూం ఇళ్ల లక్కీ డ్రా ఎట్టకేలకు బుధవారం రాత్రి పూర్తయింది. మండల కేంద్రంలోని రైతు వేదికలో 63 ఇళ్లకు సంబంధించి రాత్రి 10 గంటల తర్వాత డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలి ఉన్న 63 డబుల్‌‌‌‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చారు.

లబ్ధిదారుల ఎంపికపై రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రైతు వేదిక వద్ద ఉత్కంఠ నెలకొంది. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని నేతలు డిమాండ్‌‌‌‌ చేయగా.. నిబంధనల మేరకే ఎంపిక జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. చివరకు రాత్రి 10 గంటల తర్వాత జడ్పీ సీఈవో సాయాగౌడ్‌‌‌‌, మండల ప్రత్యేక అధికారి రాకేశ్‌‌‌‌ పర్యవేక్షణలో తహసీల్దార్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ లక్కీ డ్రా నిర్వహించారు. పోలీసుల బందోబస్తు మధ్య 63 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్‌‌‌‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌ వనజ, సర్పంచ్‌‌‌‌ గాండ్ల రాజేశ్‌‌‌‌, ఉపసర్పంచ్‌‌‌‌ రాజేందర్‌‌‌‌, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.