సంక్రాంతి వచ్చింది.. ‘డబుల్​’ ఇండ్లు రాలే

సంక్రాంతి వచ్చింది.. ‘డబుల్​’ ఇండ్లు రాలే

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లను పంపిణీ చేస్తామని ప్రకటించిన గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి మాట నెరవేరలేదు. గత ఏడాది నవంబర్‌‌ 24న డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.18,328 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల డబుల్‌ ‌బెడ్‌‌ రూం ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. 

హైదరాబాద్‌‌ జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. కలెక్టర్లు తమ పరిధిలో నిర్మించిన, తుది దశలో ఉన్న ఇండ్లను 69 వేల మంది లబ్ధిదారులకు.. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఎంపిక చేసి పంపిణీ చేయాలని సూచించారు. సంక్రాంతి రోజే గృహ ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలో హడావుడి కనిపించింది. పేదల నుంచి ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు తీసుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమోగాని అంతా సైలెన్స్ అయిపోయారు.  

అనర్హులకు ఇస్తున్నారని నిరసనలు  

డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్ల కోసం లక్షల మంది పేదలు ఆన్‌‌లైన్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కలెక్టర్లు మాత్రం చాలాచోట్ల లబ్ధిదారుల ఎంపికను ఇంకా పూర్తి చేయలేదు. పూర్తి చేసిన చోట్ల అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారనే ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో వారిని శాంతపర్చడానికి చాలా చోట్ల రీ సర్వేలకు ఆదేశాలిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్మించిన డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి గత నెల స్పష్టంగా చెప్పారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ ప్రజాప్రతినిధులు, లీడర్లు ఫీల్డ్​లెవెల్​లో రంగంలోకి దిగారు. దళితబంధు లెక్కనే బీఆర్ఎస్ కార్యకర్తలకు, తమ అనుచరులకు ఇండ్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను పక్కన పెట్టి ఎమ్మెల్యేల సహాయంతో కొత్త లిస్టులను కలెక్టర్లకు పంపిస్తున్నారు. దీంతో అర్హుల పేర్లు ఎగిరిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హులకు ఇవ్వకపోతే గొడవలు జరిగే అవకాశం ఉందని కొందరు కలెక్టర్లు లిస్టులు ఫైనల్​చేయడానికి వెనుకాడుతున్నట్టు తెలిసింది.  

బిల్లులిచ్చేదాకా ఒప్పుకోమంటున్న కాంట్రాక్టర్లు 

డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇంజినీరింగ్‌‌ శాఖలను ఇన్‌‌వాల్వ్‌‌ చేసింది. కాంట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18,328 వేల కోట్లతో 2.91 లక్షల ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టి ఇప్పటివరకు 26 వేల ఇండ్లను పంపిణీ చేసింది. పనులకు సంబంధించి రూ.11,990 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా రూ.6 వేల కోట్లకు పైగా పనులు పెండింగ్‌‌లో ఉండగా.. చేసిన పనికి సంబంధించిన రూ.వెయ్యి కోట్లకు పైగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. 

గడిచిన నెలన్నరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌‌ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. దీంతో వేలాది ఇండ్లు స్లాబులు వేసి గోడలు కట్టకుండా, పిల్లర్ల లెవెల్​లో‌, బెస్‌‌మెంట్‌‌ స్థాయిలో ఆగిపోయాయి. గత 50 రోజుల్లో భూపాలపల్లి వంటి జిల్లాలో అయితే పిచ్చి మొక్కలు కూడా క్లీన్‌‌ చేయించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పినప్పటికీ.. సర్కారు సగం బిల్లులు మాత్రమే ఇవ్వడంతో తమ బిల్లులు ఇచ్చేంతవరకు పంపిణీకి అంగీకరించేది లేదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖాసీంపల్లికి చెందిన బండారి నరసయ్య కుటుంబం ఇది. వీరికి సొంత ఇల్లు లేదు. భార్య సత్తమ్మ, కూతురు తేజస్విని, కొడుకులు పూర్ణచందర్‌‌, శ్యామ్‌‌లతో కలిసి కూలిపోయే ఈ రేకుల షెడ్డులో తాటిమట్టలు అడ్డుగా పెట్టుకొని ఉంటున్నారు. డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇంటి కోసం సత్తమ్మ పేరుపై ఇప్పటికే ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లిస్టులో మాత్రం ఈమె పేరు లేదు. 960 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని చెబుతున్నారని, తమ లాంటి వాళ్లకు ఇల్లిచ్చి ఆదుకోవాలని వీరు కోరుతున్నారు.  

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీకి 560 డబుల్​బెడ్​రూం ఇండ్లు మంజూరయ్యాయి. మొదటి విడత 289 మందికి ఇండ్లు ఇవ్వాలనుకుని 489 మందితో లిస్ట్​ రెడీ చేశారు. ఆఫీసర్లు రిలీజ్​చేసిన జాబితాలో అనర్హులున్నారనే ఆరోపణలు, ఆందోళనల నేపథ్యంలో పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ జనవరిలోనే నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉండగా అర్హులను గుర్తించడానికి మళ్లీ సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు.  

ఇవి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కట్టిన 960 డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లు. 2018లోనే పూర్తయినా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ప్రజల నుంచి రెండు, మూడు సార్లు అప్లికేషన్లు తీసుకుని వార్డుల్లో మీటింగులు కూడా పెట్టారు. అయినా ఎవరికీ ఇల్లివ్వలేదు. దీంతో రోడ్లకు రెండు వైపులా పిచ్చి మొక్కలు మొలిచాయి. తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్‌‌ వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో గృహ ప్రవేశం చేయని ఇండ్లకు రిపేర్లు చేయాల్సిన దుస్థితి దాపురించింది.