కుమ్రం భీం ​వారసుల గోస

కుమ్రం భీం ​వారసుల గోస
  • మూడేండ్లలో కట్టిన డబుల్​ఇండ్లు మూడే
  • బిల్లులు ఇయ్యకపోవడంతో ఆపేసిన ఆదివాసీలు 

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రం భీం వారసుల కోసం జిల్లాలోని జోడేఘాట్​లో డబుల్​బెడ్​రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న హామీ నెరవేరడం లేదు. మూడేండ్ల క్రితం 30 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన సర్కారు..బిల్లులు మంజూరు చేయకపోవడంతో కేవలం మూడంటే మూడు నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఎవరి ఇండ్లను వాళ్లే డబ్బులు పెట్టుకుని కట్టుకునే పరిస్థితి ఉండడంతో ముందుకు సాగడం లేదు. 23 ఇండ్ల నిర్మాణం ఇంకా కొనసాగుతుండగా, నాలుగు ఇండ్ల పనులు ఇంకా మొదలే పెట్టలేదు.  

2014లో కేసీఆర్...2016 కేటీఆర్​ హామీలు
2014 సంవత్సరంలో జోడేఘాట్ లో జరిగిన కుమ్రం భీం వర్ధంతికి సీఎం కేసీఆర్ హాజరై జోడేఘాట్​ఆదివాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ రెండేండ్ల తర్వాత 2016 లో జరిగిన వర్ధంతి సభకు మంత్రి కేటీఆర్ హాజరై డబుల్ ఇండ్ల హామీ ఇచ్చారు. జోడేఘాట్ లో మొత్తం 50 ఆదివాసీ కుటుంబాలు ఉండగా హామీ ఇచ్చిన నాలుగేండ్ల తర్వాత 2020 సంవత్సరంలో కేవలం 30 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జడ్పీ చైర్మన్​ కోవ లక్ష్మి ,ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అప్పటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఐటీడీఏ పీఓ భవేశ్ మిశ్రా ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఎవరి ఇండ్లను వారే కట్టుకుంటే బిల్లులు శాంక్షన్​చేస్తామని చెప్పడంతో 26 మంది అప్పులు చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇందులో ముగ్గురి ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో ఆరుగురు రూప్ లెవెల్ వరకు కట్టుకున్నారు. చేతిలో చిల్లి  గవ్వలేని నలుగురు నిరుపేద ఆదివాసీలు ఇంకా పనులు షురూ చేయలేదు. గత ఏడాది బిల్లుల కోసం ఆందోళన చేయగా కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా రూ.60 వేల చొప్పున బిల్లులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో ఇల్లు కట్టుకున్నవారు అప్పు తెచ్చిన చోట సమాధానం చెప్పుకోలేక పాట్లు పడుతున్నారు. మరికొందరు ఉన్న ఇండ్లను పీకి నిర్మాణాలు చేపట్టామని, బిల్లులు రాక అవి ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూరి గుడిసెల్లోనే బతుకుతున్నారు.  ఇప్పటికైనా బిల్లులు ఇవ్వకపోతే ఈనెల 9న జరిగే వర్ధంతి సభలో అధికారులను నిలదీస్తామంటున్నారు. 

రికార్డు చేసి బిల్లులు వచ్చేలా చూస్తా
జోడేఘాట్ లో నిర్మించుకుంటున్న గిరిజనుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లు గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావాల్సి ఉంది. నిర్మాణం ఏ మేరకు అయ్యిందో  ఆ మేరకు రికార్డు చేసి లబ్ధిదారులకు బిల్లులు వచ్చేలా చుస్తాం. – నిరంజన్, ఐటీడీఏ డీఈ 

బిల్లులు రాక గోస అయితాంది
కష్టాలు పడి అప్పులు చేసి ఇంటి నిర్మాణం షురూ చేసిన. గత ఏడాది రూ. 60 వేల బిల్లు ఇచ్చిన ఆఫీసర్లు ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు. కలెక్టర్ కు చెప్పినా లాభం  లేకుండాపోయింది. ఏడాది నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గిట్లయితే ఇండ్ల నిర్మాణం ఎప్పుడు కంప్లీట్ అయితది. కొత్త ఇండ్లలోకి ఎప్పుడు పోయేది? జల్దిన బిల్లు ఇయ్యాలే.– కుమ్రం యశ్వంత్ రావు, గ్రామస్తుడు, జోడేఘాట్

రూ .60 వేలు అప్పు చేసిన..
డబుల్ బెడ్ రూమ్ వచ్చిందని సంతోషం ఉన్నా నిర్మాణం కోసం పైసలు లేని పరిస్థితి ఉండే. ఓ వ్యాపారి దగ్గర రూ. 60 వేలు అప్పు చేసి పిల్లర్లు వేసిన. గత ఏడాది బిల్లులు ఇస్తలేరని లొల్లి చేస్తే రూ.60 వేల బిల్లు ఇచ్చిన్రు. ఆ డబ్బులతో పాటు మరో రూ.10 వేలు మిత్తి కలిపి వ్యాపారికి కట్టిన.  పైసలు లేక పిల్లర్లకు ఇప్పటి వరకు బీమ్​లు వేయలేదు. ఇండ్లు ఇచ్చిన గవర్నమెంట్ బిల్లు ఇయ్యకుంటే ఎట్లా? ఇప్పటికైనా అధికారులు, సర్కారు స్పందించి బిల్లులు ఇయ్యాలె. – పెందోర్ కేశవరావు, గ్రామస్తుడు, జోడేఘాట్​