- వ్యతిరేకిస్తున్న ఎంఎన్‌జే డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: మెహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్‌జే) క్యాన్సర్ హాస్పిటల్ కు కొత్త డైరెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ హెచ్ వోడీగా ఉన్న డాక్టర్ సదాశివుడును ఎంఎన్‌జే ఇన్‌చార్జ్ డైరెక్టర్ గా అపాయింట్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జోసెఫ్ బెంజిమిన్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తక్షణమే కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.
అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంఎన్‌జే హాస్పిటల్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా హాస్పిటల్ లో సేవలందిస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, హెచ్ వోడీలను కాదని నిమ్స్ వ్యక్తికి పగ్గాలు అప్పగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఇప్పటికే మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిరసనలో డాక్టర్లు శ్రీకాంత్, రఘురామన్, ప్రకాశ్, రాధిక తదితరులు పాల్గొన్నారు. వీరికి టీఎన్జీవో మద్దతుగా నిలిచారు.
