గాంధీ ఆసుపత్రికి కొత్త బాస్‌‌‌‌‌‌‌‌

గాంధీ ఆసుపత్రికి కొత్త బాస్‌‌‌‌‌‌‌‌
  • సూపరింటెండెంట్​గా అడిషనల్ డీఎంఈ వాణీ నియామకం
  • నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సూపరింటెండెంట్
  • గతంలో ఇన్​చార్జ్ డీఎంఈగా పనిచేసిన ప్రొఫెసర్ వాణీ
  • రాజకుమారిని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ను మార్చింది. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వాణీని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ గురువారం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ డీఎంఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వాణీ, గతంలో ఇన్‌‌‌‌‌‌‌‌ చార్జ్ డీఎంఈగా పనిచేశారు. ఆమె శుక్రవారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

గత సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె గాంధీ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రభుత్వం డాక్టర్ రాజకుమారిని బాధ్యతల నుంచి తొలగించింది.  

బ్రాండింగ్ రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌గా గాంధీ 

గాంధీ ఆసుపత్రిని ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా ఆసుపత్రిని బ్రాండింగ్ కు రోల్ మోడల్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రాండింగ్ ద్వారా గాంధీ ఆసుపత్రికి కార్పొరేట్ లుక్ తీసుకురానున్నారు. బ్రాండింగ్ కింద ఆసుపత్రి ఎంట్రెన్స్ నుంచి వార్డుల వరకు అనేక మార్పులు తీసుకురానున్నారు. ఆసుపత్రి రంగు, సిబ్బంది డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రంగు మార్పు, వెయిటింగ్ ఏరియాలో కుర్చీలు, వీల్‌‌‌‌‌‌‌‌చైర్లు, రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్ స్థాపన వంటివి ఏర్పాటు చేయనున్నారు. 

చికిత్స తర్వాత రోగుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాల్ సెంటర్ కూడా ప్రారంభించనున్నారు. గాంధీ ఆసుపత్రి ఆధారంగానే మిగతా ఆసుపత్రులు, టీవీవీపీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని 200 ఆసుపత్రుల్లో బ్రాండింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి బ్రాండింగ్ పర్యవేక్షణకు సమర్థ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే గతంలో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ డీఎంఈగా పనిచేసిన డాక్టర్ వాణీని సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా నియమించారు.   

పేషెంట్ కేర్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత

ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తారు. వారికి మెరుగైన చికిత్స అందించడమే మా బాధ్యత. గత రెండు రోజులుగా గాంధీలో పర్యటించి అనేక సమస్యలు గమనించాను. గాంధీలో ఇప్పటికీ 25 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్లు మాత్రమే ఉన్నాయి. పేషంట్ల సంఖ్య మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉంది. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్లను పెంచుతాం. 

ఓపీ కౌంటర్లు, ప్రభుత్వ ఫార్మసీ ఒకే దగ్గర ఉండటంతో  హాలు రద్దీగా మారుతుంది. దానికి సొల్యూషన్ ఆలోచిస్తం. ఇక గాంధీ ఆసుపత్రి ఆవరణలో చాలా ప్రైవేట్ మెడికల్ షాపులు ఉన్నాయి. లీగల్ సలహాలు తీసుకొని వాటిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటాము. పేషెంట్ కేర్‌‌‌‌‌‌‌‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను.- ప్రొఫెసర్ వాణీ, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి