టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటేనే సమాజానికి మేలు : ద్రౌపది ముర్ము

టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటేనే సమాజానికి మేలు : ద్రౌపది ముర్ము

నాగ్‌‌‌‌పూర్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ.. డీప్‌‌‌‌ఫేక్‌‌‌‌లను రూపొందించడానికి దుర్వినియోగం చేయడం వల్ల సమాజానికి ముప్పు వాటిల్లుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటే సమాజానికి మేలు జరుగుతుందని, దుర్వినియోగం చేస్తే మానవాళిపై ప్రభావం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. శనివారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌‌‌‌పూర్ యూనివర్సిటీ (ఆర్‌‌‌‌టీఎంఎన్‌‌‌‌యూ) 111వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు.

" యువతరం టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉపయోగిస్తున్నారు. అయితే, దానిని సక్రమంగా వినియోగించుకుంటే సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. దుర్వినియోగం చేస్తే అది మానవాళిపై ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో నైతిక విలువలతో కూడిన విద్య మార్గాన్ని చూపుతుంది. బాలికల విద్యపై పెట్టుబడి పెట్టడం దేశ ప్రగతికి అత్యంత విలువైన అంశమని నేను నమ్ముతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో వస్తున్న భారీ మార్పుల దృష్ట్యా నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉండాలని, జీవితాంతం నేర్చుకోవడానికి కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌‌‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.