
ఐపీఎల్-13 అఫీషియల్ స్పాన్సర్ షిప్ హక్కులను డ్రీమ్ లెవన్ దక్కించుకుంది. రూ.222 కోట్ల భారీ మొత్తం చెల్లించి హక్కులను కొనుగోలు చేసినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. బిడ్ లో టాటా అన్ అకాడమీ, పతంజలి, రిలయన్స్ , బైజూస్.. డ్రీమ్ లెవన్ కు పోటీ ఇచ్చాయి. అయితే ఫైనల్ గా డ్రీమ్ లెవన్ స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లోనే చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో 5 ఏండ్లకు ఒప్పందం చేసుకుంది. నాలుగున్నర నెలల గడువు కోసం వివో (రూ. 440 కోట్లు) చెల్లిస్తుండేది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది.
2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్‌గా వివో ఉన్నప్పటికీ.. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో చైనా కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ల మేరకు చైనా మొబైల్ కంపెనీ స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, షార్జా, అబుధాబిలో నిర్వహించనున్నారు.