కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో తాగునీరు సురక్షితమే..  నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా లేదు

కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో తాగునీరు సురక్షితమే..  నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా లేదు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 9 నుంచి 15వ తేదీ మధ్య కాజీపేట, వరంగల్ స్టేషన్లు.. అలాగే, రైల్వే కాలనీల నుంచి సేకరించిన తాగునీరు చాలా శుభ్రంగా, సురక్షితంగా ఉన్నట్లు అన్ని ల్యాబ్ టెస్టుల్లో తేలిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాజీపేట నుంచి 149, వరంగల్ నుంచి 76 నమూనాలతో కలిపి మొత్తం 225 నీటి నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. పరీక్షించిన నమూనాల్లో  ఒక్క నీటి బొట్టు కూడా తాగడానికి పనికిరాకుండా లేదని స్పష్టమైనట్లు స్పష్టం చేసింది.  

ముఖ్యంగా ప్రయాణికులకు అనారోగ్యం కలిగించే 'ఈ-కోలి' బ్యాక్టీరియా ఆనవాళ్లు కూడా ఎక్కడా లభించలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నీటి ట్యాంకులను, భూగర్భ జలాశయాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తాగుతున్న నీటి ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మలా రాజారామ్ కూడా ఇటీవల స్వయంగా పరిశీలించారు. నీటిలో క్లోరిన్ స్థాయిలు సరిగ్గానే ఉన్నాయని ఆమె నిర్ధారించారు.

ప్రయాణికులకు అందించే తాగునీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషితం కావడానికి వీల్లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రైల్వే నిబంధనల ప్రకారమే నీటి నాణ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రయాణికులందరికీ ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఇదే పర్యవేక్షణను భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు.