ఆదర్శంగా నిలుస్తున్న భూంపల్లి గ్రామ ప్రజలు

ఆదర్శంగా నిలుస్తున్న భూంపల్లి గ్రామ ప్రజలు

తరాలు మారాయి. జీవన శైలి మారింది. ఆహార అలవాట్లు, కట్టుబాట్లన్నీ మారాయి. ఒకప్పుడు బావినీళ్లు తాగి జీవనం సాగించేవారు.. ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. కానీ, కామారెడ్డి జిల్లాలోని ఆ ఊరిలోని వారు ఇప్పటికీ బావినీళ్లనే తాగుతున్నారు. 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ ప్రజలకు మినరల్ వాటర్ అంటే తెలియదు. ఇక్కడ ఇంటికో బావి ఉంటుంది. కొత్తగా ఇళ్లు కట్టునేవాళ్లు తప్పనిసరిగా బావి తవ్వాల్సిందే. తాగు నీరు, ఇతర అవసరాలకు అంతా బావి నీరే వాడుతుంటారు. బంధువులు వచ్చారంటే .. బొక్కెన బావిలో వేసి నీళ్లు తోడి చేతికి అందిస్తారు. 



చుట్టూ గుట్టలు మధ్యలో లోతట్టు ప్రాంతంలో ఈ గ్రామం ఉంటుంది. 565 వరకు కుటుంబాలున్నాయి.వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం. భూంపల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి నీటి ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటీకి నల్లా ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.కానీ, వాటిని ఉపయోగించరు. బావి నీళ్లే స్వచ్చమైనవిగా భావిస్తుంటారు జనం. ఇంటి ముందు బావి ఉంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్లేనని నమ్ముతారు. 



ఎండకాలంలోనూ బావులు నీటితో కలకలలాడుతాయి.15 అడుగుల లోతులో కావాల్సినంత నీరు దొరుకుతుంది. ఇక్కడి బావుల లోతు అత్యధికంగా  60 అడుగులు ఉంటుంది. తొంగి చూస్తే పైకి నీళ్లు కనిపిస్తాయి. ఇక్కడ బోర్లు వేస్తే నీరు పడవు. బావులు తోడితేనే పుష్కలంగా నీరు వస్తుంది. చాలా మంది బోర్లు వేసినా నీరు పడలేదు. కానీ, బావి తవ్వితే నీళ్లొచ్చాయంటున్నారు గ్రామస్థులు. 

స్వచ్ఛమైన బావినీరు ఆరోగ్యానికి మంచివని ఇక్కడి ప్రజల విశ్వాసం.గతంలో చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడినప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి బావుల్లో నీరు చేదుకుని వెళ్లేవారని చెబుతున్నారు స్థానికులు.  తరాలుగా వస్తున్న చేదబావి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా జీవిస్తున్నారు భూంపల్లి ప్రజలు.