ఓటర్లకు ఎన్నికల కానుకలు.. యూత్​కు డ్రైవింగ్​ లైసెన్స్​లు, స్పోర్ట్స్​కిట్లు

ఓటర్లకు ఎన్నికల కానుకలు.. యూత్​కు డ్రైవింగ్​ లైసెన్స్​లు, స్పోర్ట్స్​కిట్లు
  • మహిళలకు కుట్టు మిషన్లు, కుక్కర్లు, చీరలు, గోడ గడియారాలు
  • సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండెటోళ్లకు సెల్​ఫోన్లు, ట్యాబ్ లు
  • గిఫ్టుల పంపిణీలో రూలింగ్​పార్టీ అభ్యర్థులదే హవా.. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ, కాంగ్రెస్​ ఆశావహులు

మహబూబాబాద్/నెట్​వర్క్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​కు ముందే వీలైనంతమంది ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు లీడర్లు రంగంలోకి దిగారు. ఇటీవల ఖరారైన బీఆర్ఎస్​ అభ్యర్థులతోపాటు కాంగ్రెస్, బీజేపీలోని కొందరు ఆశావహులు.. రకరకాల కానుకలతో యువ, మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. నియోజకవర్గాల్లో యువతకు ఉచితంగా డ్రైవింగ్ ​లైసెన్సులు ఇప్పించడమే గాక, హెల్మెట్లు కూడా అందజేస్తున్నారు. టోర్నమెంట్లు, ఆటల పోటీలు నిర్వహిస్తూ స్పోర్ట్స్​కిట్లు చేతిలో పెడ్తున్నారు.

 మహిళలకైతే చీరలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. గణేశ్​ ఉత్సవాలను వేదికగా చేసుకొని..  కుల, యువజన సంఘాల ఓట్లకు గాలం వేస్తున్నారు. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉన్నవాళ్లకు సెల్​ఫోన్లు, ట్యాబ్​లు, ఈజీఎస్​ కూలీలకు లంచ్​ బాక్సులు, వాటర్​ బాటిళ్లు.. ఇలా ఒక్కో వర్గాన్ని ఒక్కో రకమైన కానుకలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

మేళాలు పెట్టి మరీ..!

రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో యువ​ఓటర్లను ఆకట్టుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫ్రీ డ్రైవింగ్​ లైసెన్స్​ మేళాలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదట ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ తన ‘పువ్వాడ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటపట్టారు. మంత్రి అజయ్​గడిచిన రెండు నెలల్లో సుమారు 5 వేల మంది యువతీయువకులకు ఫ్రీగా డ్రైవింగ్​ లైసెన్సులు అందించారు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి తన క్యాంప్​ ఆఫీసు కేంద్రంగా పదుల సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు నిర్వహించి, ఏకంగా14 వేల మందికి ఫ్రీగా లైసెన్స్​లు ఇప్పించారు. 

భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత కూడా ఒక్కొక్కరు 10 వేల మందికి తగ్గకుండా యువతకు డ్రైవింగ్​ లైసెన్సులు అందజేశారు. గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రెండు నెలలుగా పోటాపోటీగా ఫ్రీ డ్రైవింగ్ ​లైసెన్స్​ మేళాలు కొనసాగిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు ఇప్పటికే 20 వేల మంది యువతకు లర్నింగ్​ లైసెన్స్​ల కోసం దగ్గరుండి అప్లై చేయించారు. దుబ్బాకలో లర్నర్స్​ లైసెన్స్​ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్లు స్వీకరించడంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీఆర్​ఎస్​ ఎంపీ, అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీపడ్తున్నారు. 

ఇక సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఊరూరా స్పోర్ట్స్​కిట్లు పంచుతున్నారు. నెల కింద ‘జగదీశన్న కప్’ పేరుతో ఆటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని యూత్​కు క్రికెట్, వాలీబాల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్​బీఆర్ఎస్​ఎమ్మెల్యే బానోతు శంకర్​నాయక్ యువతకు ఉచిత డ్రైవింగ్​ లైసెన్సులు ఇస్తుండగా.. కాంగ్రెస్​నుంచి పాలకుర్తి టికెట్ ఆశిస్తున్న ఎన్ఆర్ఐ అనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఇప్పటికే టెట్ అభ్యర్థులకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ అందించారు.

 జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పటివరకు 6 వేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించారు. డోర్నకల్​ నుంచి కాంగ్రెస్​ టికెట్​ఆశిస్తున్న కిసాన్ పరివార్​ సంస్థ అధినేత నానవత్ భూపాల్​నాయక్​ఇటీవల మరిపెడలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మండలాల కోఆర్డినేటర్లకు స్మార్ట్​ఫోన్లు, ట్యాబ్​లు అందజేశారు. 

గణేశ్​ మండపాలకు కరెంటు బిల్లులు కడ్తున్నరు

వాడవాడలా గణేశ్​ మండపాలకు ఇప్పటికే ఉచితంగా విగ్రహాలు, ఖర్చులకు పైసలు ఇచ్చిన నేతలు.. ఓ అడుగు ముందుకేసి కరెంట్​ బిల్లులు కూడా కడ్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు మంత్రి గంగుల కమలాకర్ తన సొంత నిధులతో రూ. 4 లక్షల కరెంట్​బిల్లు చెల్లించారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇల్లెందు టౌన్​లోని 45 వినాయక మండపాలకు కరెంట్​బిల్లులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ఆదివారం విద్యుత్​అధికారులకు రూ. 50 వేలు అందజేశారు. ఇదీగాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండపాల వద్ద అభ్యర్థులే అన్నదానాలు చేయిస్తున్నారు. 

ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, భువనగిరిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డి తదితరులు పాల్గొని భక్తులకు వడ్డించారు. హైదరాబాద్​ సిటీలోనూ ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సొంత ఖర్చుతో నియోజకవర్గంలోని అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్లకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల ఉపాధి హామీ కూలీలకు వాటర్ ఫ్లాస్కులు పంపిణీ చేశారు.  

కుట్టుమిషన్లు, గోడ గడియారాల పంపిణీ

మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తండ్రి రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ‘కంది ఫౌండేషన్’ పేరుతో నెలరోజులుగా మహిళలకు ప్రెజర్​కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఇటీవల నిర్మల్​లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు 300 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవి శంకర్ ఇటీవల 400 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. 

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఇలాగే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మహిళా సంఘాలతో మీటింగులు పెట్టి ఛత్రీలు, బ్యాగులు, టీ షర్టులు పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి మహిళలకు చీరలు, గోడ గడియారాలు, ప్రైజ్ మనీ అందజేశారు. 215 మందికి రూ. 50 లక్షలతో జ్యూట్​మిషన్లు ఇచ్చారు. కానుకల పంపిణీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు దూసుకుపోతున్నారు. 

ఎర్రబెల్లి చారిటబుల్​ట్రస్ట్’​ ద్వారా మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇప్పించి, కుట్టు మిషన్లు, చీరలు అందజేస్తున్నారు. ఈజీఎస్​కూలీలకు బ్యాగులు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. యువతీయువకులకు ఉచితంగా డ్రైవింగ్​లైసెన్సులు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగుల కోసం ఇప్పటికే పాలకుర్తిలో జాబ్ మేళా నిర్వహించారు. సోమవారం తొర్రూరులో మెగా జాబ్ మేళాకు ప్లాన్​చేశారు. ఏ కార్యక్రమం నిర్వహించినా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.