
- హైదరాబాద్‌లో డ్రోన్ పోలీసింగ్
- ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తుకు
- డ్రోన్లను వాడుతున్న పోలీసులు
- ఎయిర్ పెట్రోలింగ్‌లో ఇప్పటికే 3 డ్రోన్లు..
- త్వరలో మరో 4 రంగంలోకి
- డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్: ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ రోడ్లపై డ్రోన్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు గణేశ్ శోభాయాత్ర, బహిరంగ సభలు సహా పోలీస్ బందోబస్తులో ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు సహా వీవీఐపీల భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు డ్రోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక డ్రోన్ డ్యూటీ చేస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అత్యవసరాల కోసం మరో నాలుగు అధునాతన డ్రోన్లను వినియోగించేందుకు సిటీ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
డ్రోన్ పెట్రోలింగ్ ఇలా..
ప్రస్తుతం మూడు డ్రోన్ల ద్వారా ట్రాఫిక్‌ను మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్‌లను ఆపరేట్ చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు సహా ట్రాఫిక్ జామ్ అవుతున్న రోడ్లను డ్రోన్స్ ద్వారా పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు అందిస్తున్నారు.వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో డ్రోన్లను విరివిగా ఆపరేట్ చేస్తున్నారు. రోడ్లపై బ్రేక్ డౌన్ అయిన వాహనాలను గుర్తించి ఆయా పాయింట్ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో త్వరితగతిన ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుతోంది.
ట్రాఫిక్ సమస్యలపై స్టడీ..
నిరంతరం ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను డ్రోన్ల ద్వారా అధ్యయనం చేస్తున్నారు. సిటీ మెయిన్ రోడ్లలో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న 15 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రాంతాలను గూగుల్ మ్యాప్‌ల ద్వార లొకేషన్ సహా పూర్తి సమాచారంతో రికార్డ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బీ, వాటర్ బోర్డ్ సహా సంబంధిత విభాగాలు తీసుకోవల్సిన చర్యలపై ఆయా డిపార్ట్‌మెంట్లకు నివేదికలు అందిస్తున్నారు. ట్రాఫిక్‌తో పాటు బందోబస్తులో డ్రోన్ల వినియోగం సత్ఫలితాలను ఇస్తోంది. డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను పకడ్బందీగా ఆపరేట్ చేస్తున్నారు.
డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్
సిటీలో రోజురోజుకు వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. వాహనాలకు తగ్గట్టు రోడ్ల విస్తరణకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ మానిటరింగ్ ఒక్కటే మార్గం అయ్యింది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా గగనతలం నుంచే ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్నాం. ఈ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ధ్వంసమైన రోడ్లను కూడా డ్రోన్‌లు క్యాప్చర్ చేస్తున్నాయి. మరింత అధునాత ఫీచర్స్‌తో కూడిన డ్రోన్లు కూడా కొనుగోలు చేస్తున్నాం.
- జోయల్ డెవిస్, జాయింట్ సీపీ,
ట్రాఫిక్, హైదరాబాద్