ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  • మోతాదుకు మించి ఇంజక్షన్లతో రెండు హత్యలు
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ లేకుండానే అమ్మకాలు 
  • సర్టిఫికెట్ ఒకరిది, వ్యాపారం నడిపేది మరొకరు
  • మామూళ్ల మత్తులో డ్రగ్ కంట్రోల్ అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్​ మర్డర్​ కేసులో కీలకమైన మత్తు మందు కోసం నిందితులు రూ.5 వేలు ఖర్చు చేశారు. 5 ఎంఎల్ డోసులో రెండు ఇంజెక్షన్లు సిద్ధం చేసుకున్నా, ఒక ఇంజెక్షన్ ​ఉపయోగించి ఐదు నిమిషాల్లో జమాల్ సాహెబ్​ను చంపేశారు. రెండు నెలల కింద ఇదే తరహాలో ఖమ్మం నగరంలో మరో హత్య జరిగింది. రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన బిక్షం ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్​ ఇచ్చి రెండో భార్యను చంపేశాడు. ఒకట్రెండు రోజుల తర్వాత సీసీ పుటేజీ పరిశీలించిన ఆసుపత్రి నిర్వాహకులు మత్తు ఇంజక్షన్​ ఇచ్చి చంపినట్లు గుర్తించారు. ఒకే తరహాలో జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ హంతకుల చేతికి మత్తు మందు ఇంత ఈజీగా చిక్కడం చర్చనీయాంశమైంది. 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో ఆపరేషన్ల సమయంలో పేషెంట్లకు ఇచ్చే అనస్తీషియా ఇంజక్షన్లు ఇచ్చి రెండు హత్యలు జరిగిన నేపథ్యంలో మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల దందా మరోసారి తెరపైకి వచ్చింది. డాక్టర్లకు తెలియకుండానే ఇంజక్షన్లు హంతకుల చేతుల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధం ఇష్యూలో ఓ ఆర్ఎంపీ, తనకు తెలిసిన మరో ఇద్దరి ద్వారా రెండు డోసుల మత్తు మందును సంపాదించి హత్య కోసం ఉపయోగించాడు. ఆస్పత్రిలో భార్యను చంపిన ఘటనలో ఒక ఆసుపత్రిలో నిందితుడు బిక్షం ఆపరేషన్​ థియేటర్​ అసిస్టెంట్ గా చేసిన పరిచయాలతో మత్తు మందును సంపాదించాడు. 

డ్రగ్​ కంట్రోల్​ ఎక్కడ?

రాష్ట్రంలో​ హైదరాబాద్​ తర్వాత ఆస్పత్రుల సంఖ్య, మెడికల్ షాపుల సంఖ్య పరంగా ఖమ్మం నగరం రెండో స్థానంలో ఉంటుందని చెప్తారు.  దాదాపు 500కు పైగా ఆస్పత్రులు ఖమ్మంలోనే ఉండగా, వెయ్యికి పైగా మెడికల్ షాపులు, వందల సంఖ్యలో మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో మందుల అమ్మకాలను నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారుల పనితీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ లేకుండా మందుల అమ్మకాలు, నిషేధిత మందుల సేల్స్​ సహా మెడికల్ షాపుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ షాపు పర్మిషన్ రావాలంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ లాంటి విద్యార్హతలు అవసరం. డాక్టర్లు రాసిచ్చిన మందులను రిజిస్టర్డ్  ఫార్మసిస్ట్  మాత్రమే పరిశీలించి బ్యాచ్​ నెంబర్, మెడిసిన్​ వివరాలతో కంప్యూటర్​ బిల్లు ఇవ్వాల్సి ఉండగా, అర్హత లేని వాళ్లు కూడా ఎవరో ఒకరి సర్టిఫికెట్ మీద వ్యాపారం చేస్తున్న షాపులు ఖమ్మంలో చాలా ఉన్నాయి.

అద్దెకు సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి వ్యాపారాన్ని బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారని సమాచారం. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మామూళ్లు తీసుకుంటూ రూల్స్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.  నగరంలోని చాలా షాపుల్లో  ఫోర్ట్ విన్, కొడెన్ ఫాస్పేట్, ట్రిప్టోమర్ మాత్రలు, కాఫ్ సిరప్​లను కూడా ఇష్టారీతిలో అమ్ముతున్నారని అంటున్నారు. 

మత్తు మందును మెడికల్ షాపుల్లో అమ్మొద్దు

ఆపరేషన్ల సమయంలో పేషెంట్లకు ఇచ్చేందుకు మత్తు మందును కేవలం ఆయా మెడికల్ ఏజెన్సీలు డైరెక్ట్ గా ఆసుపత్రికే సప్లై చేయాలి. డ్రగ్స్  యాక్ట్ ప్రకారం మెడికల్  షాపుల్లో అమ్మడానికి వీల్లేదు. ఆపరేషన్ సమయంలో అనస్తీషియా ఇచ్చే ముందు లేదంటే తరువాత పేషెంట్ కు కృత్రిమంగా శ్వాస అందే ఏర్పాటుచేస్తాం. లేకపోతే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. రెండు హత్యల్లోనూ మోతాదుకు మించి డోస్​ వాడడం వల్ల శ్వాస అందక చనిపోయారు. - డాక్టర్​ రాజశేఖర్, ఎండీ, అనస్తీషియా 

కాంట్రాక్ట్​ కార్మికుల నిరసనతో ఉద్రిక్తత

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లందు, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు చేస్తున్న సమ్మె14 రోజులకు చేరుకుంది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట గురువారం నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. బతుకమ్మ ఆటపాటలతో, ప్ల కార్డులతో కార్మికులు నిరసన తెలిపారు. వెహికల్స్​ రాకుండా అడ్డుగా ఉన్నారని పక్కకు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించడతో వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జేఏసీ  నాయకులు బందం నాగయ్య, కొండపల్లి శ్రీనివాస్, కృష్ణ, సారంగపాణి పాల్గొన్నారు.

విద్యుత్  బిల్లు పాసైతే  20 లక్షల మంది రోడ్డున పడ్తరు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

నేలకొండపల్లి, వెలుగు: విద్యుత్ సంస్కరణల బిల్లు పాసైతే 20 లక్షల మంది రోడ్డున పడతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గువ్వలగూడెం, ముజ్జుగూడెం, కట్టుకాసారం, చెరువుమాదారం, మండ్రాజుపల్లి, నాచేపల్లి,  రాజేశ్వపురం గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, సబ్​స్టేషన్, కోనాయిగూడెం– నాచేపల్లి అంతర్గత రోడ్​ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు 7 వేల మెగావాట్లుగా ఉన్న ఉత్పత్తిని ఎనిమిదేండ్లలో 17 వేల మెగావాట్లకు పెంచినట్లు చెప్పారు. విద్యుత్  సంస్కరణల పేరుతో పార్లమెంట్​లో బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బిల్లు వస్తే బావుల దగ్గర మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్​ పరం  చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు జిల్లా కన్వీనర్​ వెంకటేశ్వరావు, ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీపీ వజ్జా రమ్య, అనగాని నర్సింహారావు, శాఖమూరి సతీష్, లీలా ప్రసాద్  పాల్గొన్నారు.

‘పూలను పూజించే సంస్కృతి మనది’

ఖమ్మం కార్పొరేషన్/టౌన్, వెలుగు: పూలను పూజించే సంస్కృతి మనదని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. గురువారం సిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని శాంతినగర్​ కళాశాల, గట్టయ్య సెంటర్​లోని ఫ్రీడం పార్క్​లలో చీరలను పంపిణీ చేశారు. తొలుత బతుకమ్మలకు పూజలు చేసిన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కలెక్టర్​ వీపీ గౌతమ్, నగర మేయర్​ పునుకొల్లు నీరజ, డిఫ్యూటీ మేయర్​ ఫాతిమా, నగరపాలక సంస్థ కమిషనర్​ ఆదర్శ్​ సురభి, ట్రైనీ కలెక్టర్​ రాధికా గుప్తా, ఏఎంసీ చైర్మెన్​ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల శ్రీవిద్య, ప్రశాంతలక్ష్మి, నిరీషారెడ్డి, గోవిందమ్మ, అమృతమ్మ పాల్గొన్నారు.

అనంతరం టీఎన్జీవోస్  మహిళా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రోమోను మంత్రి రిలీజ్​ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు షేక్ అప్జల్ హసన్, జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్  సాగర్, మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఆర్టిజన్  కుటుంబానికి ఆర్థిక సాయం

పాల్వంచ, వెలుగు: పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశలో గ్రేడ్–2 ఆర్టిజన్ గా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన షేక్ వలీపాషా కుటుంబానికి తోటి కార్మికులు అండగా నిలిచారు. చీఫ్ ఇంజనీర్  నుంచి ఆర్టిజన్ వరకు తమవంతు సాయం అందించడంతో రూ.7.50 లక్షల జమ అయ్యాయి. గురువారం జెన్కో థర్మల్  డైరెక్టర్  బాదావత్  లక్ష్మయ్య వలీపాషా కుటుంబసభ్యులకు చెక్కును అందజేశారు. చీఫ్ ఇంజ నీర్  కమతం రవీందర్ కుమార్,  జనరేషన్  చీఫ్ ఇంజనీర్ పప్పుల రత్నాకర్, ఎస్ఈలు సంజీవయ్య, మోక్షవీర్, వరప్రసాద్, అనిల్ కుమార్, సుధాకర్, ఎస్ఏవో రామారావు, డీఈ ఫసీయోద్దీన్  పాల్గొన్నారు.  

సీతమ్మసాగర్ తో నియోజకవర్గానికి నీళ్లు

వేంసూరు, వెలుగు: సీతమ్మసాగర్​ ప్రాజెక్ట్​ నిర్మాణం ద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీరుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, పెన్షన్​ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో వేంసూరు, తిరుమలాయపాలెం మండలాల్లో భూగర్భ జలాలు సరిగా లేక కరువు పీడిత మండలాలుగా ఉండేవని అన్నారు. సీతమ్మసాగర్​ ప్రాజెక్ట్​ నిర్మాణంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసి మారోజు సుమలత, తహసీల్దార్​ ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, వైస్​ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మిపాల్గొన్నారు. 

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కారేపల్లి, వెలుగు: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్​ అన్నారు. కారేపల్లిలోని వైఎస్ఎన్​ గార్డెన్​లో  గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్​ చెక్కులు, ఆసరా పెన్షన్​ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ ఆసరా పెన్షన్లు వస్తాయని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పధకాలు పేదలందరికీ అందుతాయని చెప్పారు. మార్క్​ఫెడ్​ వైస్​చైర్మన్​ బొర్రా రాజశేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్​ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్​ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్​ జగన్, వైస్​ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, తహసీల్దార్​ రవికుమార్​ పాల్గొన్నారు.

‘డబుల్’ ఇండ్ల కోసం బీఎస్పీ ర్యాలీ

భద్రాచలం, వెలుగు: నిరుపేదలకు డబుల్​బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఎస్పీ ఆధ్వర్యంలో భద్రాచలం టౌన్​లో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్​ సెంటర్​ నుంచి తహసీల్దారు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్​ శ్రీనివాసయాదవ్​కు వినతిపత్రం అందజేశారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం సుధాకర్, మార్కాపురం సీతారాములు మాట్లాడుతూ 20 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు డబుల్​ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. 

బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీలు, ఎమ్మెల్యే

కూసుమంచి, వెలుగు: మండలంలోని చౌటపల్లి–గైగోళ్లపల్లి గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద  రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్​ పనులకు గురువారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజుల రవిచంద్ర (గాయత్రి రవి), పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్​ జిల్లా కన్వీనర్​ వెంకటేశ్వరరావు, ఎంపీపీలు శ్రీనివాస్, మంగీలాల్, డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, సర్పంచులు దామళ్ల మమత, ముల్కూరి శ్యాంసుందరెడ్డి, పద్మ వెంకటరెడ్డి, టీఆర్ఎస్​ మండల అధ్యక్ష, కార్యదర్శి వీరయ్య, ఎండీ ఆసిఫ్​పాషా పాల్గొన్నారు. 

రామయ్య కల్యాణ వైభోగం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం బేడ మండపంలో నిత్య కల్యాణం వైభవంగా జరిగింది. వర్షం కారణంగా భక్తులను కూడా ప్రాకార మండపంలోకి అనుమతించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక జరిపించి మంత్రపుష్పం సమర్పించారు. మంగళనీరాజనాలు పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి కానుకలు సమర్పించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన తోలేటి హరి పద్మావతి శ్రీనివాస్​ దంపతులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం అందజేశారు. 

టీఆర్ఎస్  పార్టీకి సర్పంచ్ రాజీనామా

కరకగూడెం, వెలుగు: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత గ్రామ పంచాయతీకి చెందిన సమత్ భట్టుపల్లి సర్పంచ్  పోలెబోయిన  శ్రీవాణి, ఉప సర్పంచ్ ముడిగ సావిత్రి గురువారం టీఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్​ పార్టీ  ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని, పార్టీ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

టైమ్​కు రాకుంటే ఎట్ల

టేకులపల్లి, వెలుగు: మండల సర్వ సభ్య సమావేశానికి సమయానికి రాకుంటే ఎలాగని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన సమావేశానికి వచ్చిన ఆయన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు రాకపోవడంతో గంటన్నర పాటు వెయిట్​​చేశారు. సమయానికి రాని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బాలారాజును ఆదేశించారు. ప్రతీ ఆఫీసర్, ప్రజాప్రతినిధి మీటింగ్​కు వచ్చేలా చూడాలన్నారు. టేకులపల్లి సెంటర్​ సమీపంలోని బోడ బజార్, 9మైల్​తండాతో పాటు మిగిలిన గ్రామాల్లో మిషన్​ భగీరథ నీళ్లు అందేలా చూడాలని ఆదేశించారు. ఎంపీపీ భుక్యా రాధ, తహసీల్దార్  కేవీ శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్  పాల్గొన్నారు.  

డబుల్​ బెడ్రూమ్​కోసం సెల్​ టవర్​ ఎక్కిండు

కూసుమంచి,వెలుగు: మండల కేంద్రానికి చెందిన కొక్కెరేణి శ్రీను డబుల్  బెడ్రూమ్​ ఇల్లు కావాలని డిమాండ్  చేస్తూ గురువారం సాయంత్రం సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. శివరాత్రి పండుగ రోజు కూడా ఇలాగే ఇల్లు కావాలని తన ఇంటి పక్కనే ఉన్న సెల్​ టవర్​ ఎక్కడంతో పోలీసులు టవర్​పై నుంచి కిందికి దింపారు. తరువాత కూడా టవర్​ ఎక్కాడు. ఇప్పడు మూడోసారి టవర్​ ఎక్కడంతో పోలీసులు కిందికి దింపారు. 

రేషన్​బియ్యం పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: టేకులపల్లి మండలం నుంచి పాల్వంచలోని ఓ రైస్​ మిల్లుకు తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పక్కా సమాచారంతో డీసీఎం వెహికల్​లో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని స్టేషన్​కు తరలించారు. మహబూబాబాద్​ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం తరలిస్తున్నట్లు అక్రమంగా వే బిల్​ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.