హైదరాబాద్ సిటీలోని జిమ్ ల్లో తనిఖీలు : ఇంజక్షన్లు వాడితే తాటతీస్తామని వార్నింగ్

హైదరాబాద్ సిటీలోని జిమ్ ల్లో తనిఖీలు : ఇంజక్షన్లు వాడితే తాటతీస్తామని వార్నింగ్

కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. సిక్స్ ప్యాక్ మోజులో పడి ప్రమాదకర ఇంజక్షన్లు తీసుకుంటోంది. జిమ్​లలో కొందరు కోచ్‌‌లు చెప్పే మాయమాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్​కు దారి తీసే ప్రమాదకరమైన మెఫెంటెర్మిన్  సల్ఫేట్ ఇంజక్షన్లను రోజూ తీసుకుంటున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరు సడెన్ కార్డియాక్ అరెస్టులను కొనితెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు అక్టోబర్ 24న  గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న జిమ్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిమ్ లలో పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. 20  బృందాలుగా ఏర్పడి 20 జిమ్ లలో తనిఖీలు చేశారు.  కండలు పెరుగుతాయంటూ యువతకు  ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇస్తున్నారు  జిమ్ నిర్వాహకులు.  ఇటీవల ఓ జిమ్ లో మెఫెంటర్మిన్ అనే ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి.  ఈ ఇంజెక్షన్ల వల్ల కండలు పెరగవని గుండె పోటు ముప్పు ఉందని చెబుతున్నారు వైద్యులు. 

హార్ట్ సర్జరీలు చేసే సమయంలో అనస్థీషియా ఇవ్వడం వల్ల పేషెంట్లకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఆ సమ యంలో బీపీని పెంచడానికి మెఫెంటెర్మిన్ సల్ఫేట్​ను ఉపయోగిస్తారు. కానీ, దీని వాడకం వల్ల మజిల్​లో ఎలాంటి గ్రోత్ ఉండదు. ఎనర్జీ మాత్రమే పెరుగుతుంది. అలాగే, గుండె సమస్యలకు దారి తీస్తుంది. కార్డియాక్ అరెస్టులకు దారితీస్తుంది.  జిమ్ చేసే సమయంలో సడెన్​గా కుప్పకూలిపోవచ్చు. కొందరు జిమ్ సెంటర్ల నిర్వాహకులే ఈ డ్రగ్ ను యూత్ కు సజెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు, డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి

యువత ఫిజికల్ ఫిట్ గా ఉండటం మంచిదే. కానీ అందుకోసం అడ్డదారులు తొక్కడమే తప్పు. ఏ డ్రగ్ దేనికి పని చేస్తుందనే సమాచారం ఆన్ లైన్ లో ఉంటుంది. ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ, యువత ఇలాంటి ప్రమాదకర డ్రగ్స్ వాడి ప్రాణా ల మీదకు తెచ్చుకుంటున్నారు. మెఫెంటెర్మిన్ సల్ఫేట్, స్టెరాయిడ్స్ ఇలా వాడటం చట్టవిరుద్ధం. జిమ్ సెంటర్లపై డీసీఏ నిరంతరం ఫోకస్ చేస్తుంది. అక్రమంగా డ్రగ్స్ వాడుతూ దొరికితే చట్టప్రకారం శిక్ష తప్పదు. జిమ్ సెంటర్ల నిర్వాహకులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.