కేవ్ పబ్​లో డ్రగ్ పార్టీ

కేవ్ పబ్​లో డ్రగ్ పార్టీ
  •  హైదరాబాద్ ఖాజాగూడలోని పబ్ పై టీజీ న్యాబ్ అధికారుల దాడి
  • 55 మందికి డ్రగ్ టెస్ట్.. 25 మందికి పాజిటివ్
  • వాళ్లందరూ అరెస్టు.. పరారీలో పబ్ ఓనర్లు
  • నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు
  • గంజాయి, కొకైన్, ఎండీఎం డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తింపు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఖాజాగూడలోని ది కేవ్ పబ్​లో డ్రగ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. శనివారం రాత్రి ఆ పబ్ పై దాడి చేశారు. టీజీ న్యాబ్, సైబరాబాద్ ఎస్​వోటీ, ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ అధికారులు, రాయదుర్గం పోలీసులు కలిసి రెయిడ్ చేశారు. పబ్​లో ఉన్న 55 మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్ట్ చేయగా, వారిలో 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో వాళ్లందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను మాదాపూర్​డీసీపీ వినీత్ ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. 

పార్టీపై ఇన్​స్టాలో పోస్టులు.. 

ఖాజాగూడ మెయిన్​ రోడ్డులోని ఓ బిల్డింగ్ నాల్గో అంతస్తులో  కేవ్ పబ్ ఉంది. ఇందులో మల్లేపల్లికి చెందిన అబ్దుల్లా అయూబ్​(24), నాగారంలోని శిల్పానగర్​కు చెందిన శేఖర్​కుమార్​(52) మేనేజర్లుగా పని చేస్తున్నారు. అబ్దుల్లా డీజే కూడా ఆపరేట్ ​చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి శనివారం పబ్​లో సైకెడెలిక్ పార్టీ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు.

 దీని కోసం బెంగుళూర్ కు చెందిన డీజే సందీప్​శర్మ(44), హైదరాబాద్​లోని దమ్మాయిగూడకు చెందిన డీజే సాయి గౌరాంగ్(26)ను రప్పించారు. ఇది ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. ఇన్ స్టాలో పోస్టులు చూసి సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లు శనివారం రాత్రి పబ్​కు చేరుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నోళ్లే ఈ పార్టీని ఎంజాయ్ చేస్తారని కస్టమర్లకు ఆర్గనైజర్లు చెప్పారు. 25 మందికి డ్రగ్స్ అందజేశారు. వీళ్లందరూ పార్టీకి మూడు, నాలుగు గంటల ముందే పబ్ బయట వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నారు. 

పరారీలో నలుగురు పబ్ ఓనర్లు.. 

కేవ్​పబ్​లో డ్రగ్ పార్టీ జరుగుతున్నదని సమాచారం అందడంతో టీజీ న్యాబ్, సైబరాబాద్​ఎస్​వోటీ, ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్, రాయదుర్గం పోలీసులు శనివారం రాత్రి 10.30  గంటల టైమ్​లో పబ్​పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 55 మందిని అదుపులోకి తీసుకుని అందరికీ డ్రగ్స్​ టెస్ట్​ చేశారు. వీరిలో 25 మందికి పాజిటివ్​వచ్చింది. డీజే ఆపరేటర్లు సందీప్​శర్మ, సాయి గౌరాంగ్, ఈవెంట్ ఆర్గనైజర్లు అయూబ్, శేఖర్​కుమార్​ కూడా డ్రగ్స్​తీసుకున్నట్టు తేలింది.

 17 మంది గంజాయి, ఇద్దరు కొకైన్​అండ్​గంజాయి, నలుగురు గంజాయి అండ్​ఎండీఎం, ఒకరు ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారు. డీజే ఆపరేటర్ సందీప్​శర్మ గంజాయి అండ్​ కొకైన్, సాయి గౌరాంగ్ ​గంజాయి అండ్​ఎండీఎం తీసుకున్నారని డీసీపీ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న 25 మందిని అరెస్టు చేశామని చెప్పారు. పబ్​ఓనర్లు రాజేశ్, అభినవ్​, సాయికృష్ణ, సన్నీ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.  

నిందితుల్లో అమెజాన్, టీసీఎస్ ఎంప్లాయీస్.. 

నిందితుల్లో టీసీఎస్, అమెజాన్​వంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, స్టూడెంట్లు ఉన్నారు. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించామని, వారికి కౌన్సెలింగ్​ఇచ్చామని డీసీపీ తెలిపారు. పిల్లలను డీఅడిక్షన్​సెంటర్​లో జాయిన్​చేయాలని సూచించామన్నారు. ఐటీ కంపెనీలకు లెటర్లు రాస్తామని, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్​ఓనర్లు నలుగురు పరారీలో ఉన్నారని, వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత పబ్​ను క్లోజ్ చేస్తామన్నారు. సమావేశంలో ఎస్​వోటీ డీసీపీ శ్రీనివాస్​గుప్తా, ఏడీసీపీ జయరాం, మాదాపూర్​ఏసీపీ శ్రీకాంత్, టీజీ న్యాబ్​డీఎస్పీ శ్రీధర్, ఎక్సైజ్​టాస్క్​ఫోర్స్​డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.