వరంగల్‍ ఎంజీఎంలో  మందుల కొరత

వరంగల్‍ ఎంజీఎంలో  మందుల కొరత

వరంగల్‍, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్​లో పేద పేషెంట్లకు మందుగోలీలు దొరుకుతలేవు. ఫ్రీ ట్రీట్‍మెంట్‍ కోసం వందల కిలోమీటర్ల నుంచి వచ్చే బాధితులకు మెడిసిన్​ బయిటికి రాస్తుండడంతో బిల్లులు తడిసి మోపెడుతున్నయి. నాలుగైదు రకాల గోలీలు రాస్తే.. ఒకట్రెండు మందులు చేతిలో పెట్టి మిగిలినయి బయటి మెడికల్‍ షాపుల్లో తెచ్చుకోమంటున్నరు. తీరా వారు చెప్పిన ప్రైవేట్‍ మెడికల్‍ షాపులకు పోతే వేలకు వేలు అవుతుండటంతో పేషెంట్ల బంధువులు లబోదిబోమంటున్నారు. 
టైం టూ టైం రాక.. ఫుల్లు షార్టెజ్‍
వరంగల్‍ ఎంజీఎంలో కొన్ని నెలలుగా మెడిసిన్‍ షార్టేజ్​ నెలకొన్నది. రెగ్యూలర్‍గా వాడాల్సిన మందులు అందుబాటులో ఉండట్లేదు. ఎంజీఎంలో పేషెంట్ల రద్దీకి అనుగుణంగా  ఈ ఏడాది రూ.7 కోట్లు కేటాయించారు. ఎసెన్షియల్‍ మెడికల్‍ లిస్ట్ (ఈఎంఎల్‍) ఆధారంగా ఇందులో 80 శాతం మెడిసిన్​ టీఎస్‍ఎంఐడీసీ ద్వారా సప్లై చేయాలి. మిగతా 20 శాతం ఎమర్జెన్సీ కింద ఎంజీఎం ఆఫీసర్లు హస్పిటల్‍ డెవలప్‍మెంట్ ఫండ్స్ (హెచ్‍డీఎఫ్‍) నుంచి లోకల్‍గా కోనుగోలు చేయవచ్చు. మొత్తంగా ఏడాదికి నాలుగు విడతల్లో..  రాబోయే మూడు నాలుగు నెలలకు కావాల్సిన మెడిసిన్‍ ముందస్తుగా మెడికల్‍ స్టోర్‍రూంలో ఉండేలా ఆఫీసర్లు, పారామెడికల్‍ సిబ్బంది ప్లాన్‍ చేసుకోవాల్సి ఉంది. కాగా పేషెంట్లకు రెగ్యూలర్‍గా రాసే మందుల్లో ఏం తక్కువ 50 నుంచి 60 రకాల మెడిసిన్‍ ప్రస్తుతం ఎంజీఎంలో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. పేషెంట్ల రద్దీకి అనుగుణంగా ఇప్పటికిప్పుడు కోటిన్నర నుంచి రూ.2 కోట్ల మందులు అవసరముంది. పైస్థాయిలో టీఎస్‍ఎంఐడీసీ, హస్పిటల్లో వీటి నిర్వహణ చూసే అధికారుల మధ్య కోఆర్డినేషన్‍ లేకపోవడంతో ఒక్కసారిగా మందులు అందుబాటులో లేకుండాపోయాయనే విమర్శలు వస్తున్నాయి. 
నో పెయిన్‍ కిల్లర్స్.. నో కాంబినేషన్‍ డ్రగ్‍ 
ఎంజీఎం హాస్పిటల్ వచ్చే పేషెంట్లకు ట్రీట్‍మెంట్‍ ఇచ్చే క్రమంలో ఎక్కువ సంఖ్యలో వాడే రెగ్యలర్‍ మెడిసిన్‍తో పాటు ఖరీదైన పెయిన్‍ కిల్లర్స్, యాంటీబయాటిక్స్​అందుబాటులో లేవు. రోజువారీ మెడిసిన్‍కు అనుబంధంగా రాసే కాంబినేషన్‍ డ్రగ్స్ కు​ కూడా కొరత ఉంది.  వివిధ ప్రమాదాల్లో బాధితులకు సర్జరీలు చేసే క్రమంలో వాడే ఆపరేషన్‍ థియేటర్‍ కిట్లు లేవు. కాలిన గాయాలకు రాసే క్రీములు లేవు. ఇందులో ఏవి కావాలన్నా బయట ఉండే  ప్రైవేట్‍ మెడికల్‍ షాపులే దిక్కవుతున్నాయి. ఇదిఇలా ఉండగా కొందరు  సిబ్బంది.. మెడికల్‍ మాఫియా కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్పిటల్లో కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సమాచారం. ఎక్కువ ధర పలికే వాటిని బయటి మెడికల్‍ షాపుల్లో తెచ్చుకోమని చీటి చేతుల్లో పెడుతున్నారు. కమీషన్‍ ఎక్కువచ్చే మెడిసిన్‍ కొనుగోలు చేసేలా ఇన్‍డైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
వారానికి మందులు రాసి.. రెండ్రోజులకే ఇస్తున్రు
మందులు లేవంటూ సిబ్బంది పేషెంట్లతో ఆడుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రీట్‍మెంట్‍ ఇచ్చే క్రమంలో ఐదారు రకాల మందులు రాసి ఒకట్రెండు చేతిలో పెడుతున్నారు. హాస్పిటల్‍లో ఉండే నాలుగైదు రోజులే కాకుండా  పేషెంట్‍ డిశ్చార్జి అయ్యే టైంలోనూ ఇదే పరిస్థితి. బలం గోలీలు, సిరప్‍, ఇతరత్రా పెయిన్‍ కిల్లర్స్‍ వారానికి సరిపోయేవి రాసి రెండ్రోజులకు సరిపోయే ఒకట్రెండు మందులు ఇస్తున్నారు. మిగతావి బయట ఉండే మెడికల్‍ షాపులకు రాస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆ మెడిసిన్‍ కేవలం ఎంజీఎం దగ్గర్లోని ప్రైవేట్‍ మెడికల్‍ షాపుల్లో మాత్రమే దొరుకుతున్నాయి. దీంతో ఫ్రీ ట్రీట్‍మెంట్‍ కోసమొచ్చే పేద జనాలకు వేల రూపాయల మెడిసిన్‍ భారం తప్పట్లేదు.