దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. 2024 టీ20 ప్రపంచ కప్‌కు డుప్లెసిస్

దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. 2024 టీ20 ప్రపంచ కప్‌కు డుప్లెసిస్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ జాతీయ జట్టుకు దూరమై రెండు సంవత్సరాలు దాటిపోయింది. 2021 లో పాకిస్థాన్ పై తన చివరి టెస్ట్ ఆడిన ఫాఫ్.. 2020లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కుర్రాళ్ల ఫామ్ కారణంగా 2021, 2022 టీ20 వరల్డ్ కప్ జట్టులో ఈ వెటరన్ ప్లేయర్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా తాజాగా డుప్లెసిస్ 2024 టీ20 వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
 
ప్రస్తుతం డుప్లెసిస్ అబుదాబి T10 లీగ్ ఆడుతన్నాడు. ఈ సందర్భంగా తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు  చేసాడు. "2024 వరల్డ్ కప్ కు నేను జట్టులో రాగలనని నమ్ముతున్నాను. రెండు సంవత్సరాలుగా కోచ్ రాబర్ట్ వాల్టర్, నేను రీఎంట్రీ గురించి చర్చిస్తున్నాను. ఈ సారి నేను జట్టులో చేరితే దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంటుందని ఆయన తెలియజేశాడు". అని ఈ సీనియర్ ప్లేయర్ తాను దక్షిణాఫ్రికా జట్టులో చేరబోతున్నట్లు హింట్ ఇచ్చేసాడు. 

వెస్టిండీస్, USAలలో వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న T20 ప్రపంచకప్‌కు డు ప్లెసిస్ తో పాటు క్వింటన్ డికాక్, రిలీ రోసౌ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటారని దక్షిణాఫ్రికా వైట్-బాల్ కోచ్ వాల్టర్ సోమవారం(డిసెంబర్ 4) తెలిపారు.దీంతో డుప్లెసిస్ జాతీయ జట్టులోకి రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఐపీఎల్ తర్వాత జూన్ 3నుంచి 30 వరకు 20 జట్లతో టీ20 వరల్డ్ కప్ జరగబోతుంది.        

39 ఏళ్ల ఫాఫ్.. 2014, 2016 T20 ప్రపంచ కప్‌లలో దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా జరిగే T20 లీగ్‌లలో అదరగొట్టేస్తున్నాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కెప్టెన్ గా ఆడుతున్న డుప్లెసిస్.. 14 మ్యాచ్ ల్లో 730 పరుగులు చేసి 2023 ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.