
మెదక్ జిల్లా : దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 56 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16. 17న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా.. నవంబర్ 10న కౌంటింగ్ జరగనుందని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టాయి. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో మంగళవారం నుంచి దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.