బ్యాంకుల్లో పైసలిస్తలేరు

బ్యాంకుల్లో పైసలిస్తలేరు
  • మళ్లీ ముసురుకున్న నగదు కొరత
  • వానలు పడుతుండటంతో సొమ్ము కోసం రైతుల క్యూ
  • నగదు ఇవ్వకపోతుండటంతో పెట్టుబడి కోసం ఇక్కట్లు‌‌‌‌
  • స్కూళ్లు మొదలవడంతో పైసల కోసం వెళుతున్న జనం
  • ఖాతాల్లో డబ్బులున్నా రోజుకు పది, ఇరవై వేలే ఇస్తున్న బ్యాంకర్లు
  • కావాలంటే ఆన్​లైన్​ ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలని సూచనలు
  • రోజూ వెళ్లి బ్యాంకుల ముందు అన్నదాతల క్యూ

ఇది భూపాలపల్లి జిల్లా శాయంపేటలోని ఎస్​బీఐ బ్రాంచి. రోజూ వెయ్యి మందికిపైగా ఖాతాదారులు వస్తుంటారు. వీరిలో 90 శాతం డ్వాక్రా మహిళలు, రైతులే. రైతులు ఇటీవల వడ్లు, మక్కలు అమ్మడంతో బ్యాంకులో డబ్బులు పడ్డాయి. పంటల సీజన్‌‌‌‌ కావడంతో డబ్బులు తీసుకునేందుకు వారంతా బ్యాంకుకు వస్తున్నారు. కానీ నగదు లేదంటూ రోజు పది, ఇరవై వేలకు మించి ఇవ్వడం లేదు. దానికీ గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. రోజూ బ్యాంకు దగ్గర లైన్లో నిలబడితే పొలం పనులు ఎవరు చూసుకోవాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెలుగు నెట్​వర్క్: ఖరీఫ్‌‌‌‌ సీజన్‌‌‌‌ మొదలైంది. వానలు పడుతున్నయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో పడ్డరు. కూలీలకు, ట్రాక్టర్‌‌‌‌ కిరాయి, విత్తనాల కొనుగోలుకు సొమ్ము కావాలె. ఈ మధ్య అమ్మిన వడ్లు, మక్కల పైసలు బ్యాంకు అకౌంట్లలో పడ్డయి. రైతు బంధు పైసలు కూడా వచ్చినయి. ఆ సొమ్ము తీసుకుని పొలం పనులు చేసుకోవాలె. కానీ బ్యాంకుల్లో పైసలిస్తలేరు. అకౌంట్లలో సొమ్మున్నా నగదు లేదనుకుంట.. రోజుకు పది వేలో, ఇరవై వేలో చేతిలో పెడుతున్నరు. కొన్ని చోట్ల అయితే ‘నో క్యాష్’అని బోర్డులు పెడుతున్నరు. ఏటీఎంలలో కూడా డబ్బులు ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్​నగర్​ జిల్లాల పరిధిలో నగదు కొరత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనైతే రైతులు అరిగోస పడుతున్నరు. రోజూ వచ్చి బ్యాంకుల ముందు లైన్ల నిలబడితె… పొలం పనులు చేసుకునుడు ఎట్లాగని వాపోతున్నరు. అకౌంట్లలో పైసలు ఉన్నా కూడా బయట అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నరు.

వడ్లు, మక్కల పైసల కోసం..

రబీ‌‌లో పండించిన వడ్లు, మక్కలను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రైతులకు సంబంధించి వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. రైతులు ఆ డబ్బుల కోసం బ్యాంకులకు వెళుతున్నారు. దీంతో బ్యాంకుల్లో భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పొద్దున బ్యాంకుల తలుపులు తెరవక ముందే వెళ్లి వేచి ఉంటున్నారు. రైతులకు తోడు డ్వాక్రా మహిళలు, ఉపాధి‌‌ కూలీలు కూలీలు కూడా వస్తున్నారు. బ్యాంకు సిబ్బంది నగదు కొరత కారణంగా అందరికీ డబ్బులు ఇవ్వలేక.. ఒక్కొక్కరికి రోజుకు పది, ఇరవై వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇంకా కావాలంటే మరునాడు రమ్మంటున్నారు. కనీసం ఏటీఎంలకు వెళ్లి సొమ్ము తీసుకుందామనుకున్నా.. ఎక్కడా డబ్బులు ఉండటం లేదు. కేవలం పట్టణాల్లోని ఏటీఎంలలో మాత్రమే క్యాష్​ నింపుతున్నారు. అక్కడా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు పనులు వదిలేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు స్కూళ్లు మొదలుకావడంతో పిల్లల ఫీజుల కోసం డబ్బు తీసుకునేందుకు జనం బ్యాంకులకు వెళుతున్నారు. వారికీ ఇబ్బంది తప్పడం లేదు.

నోట్ల రద్దు ఎఫెక్ట్​ నుంచి..

పెద్ద నోట్ల రద్దు సమయంలో జనమంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయినయని, నగదుకు కొరత వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎలక్షన్ల సమయంలో చాలా నగదు విత్​డ్రా అయిందని, కానీ డిపాజిట్లు రాక నగదు కొరత ఏర్పడిందని అంటున్నారు.

రోజు వస్తె పొలం పనులెట్ల?

నాకు నాలుగెకరాల భూమి ఉంది. మరో రెండెకరాలు కౌలు తీసుకున్న. వానలు పడుతున్నయని పనులు మొదలుపెట్టిన. నాలుగు రోజుల కింద వడ్ల పైసలు బ్యాంకుల పడ్డయి. ఎవుసం పనులకు అవసరమైన పైసల కోసం బ్యాంకుకు పోయిన. అవసరమున్నన్ని పైసలు ఇయ్యరట. రోజుకు పదివేలు ఇస్తమంటుండ్రు. మా పైసలు మాకు ఇచ్చేటానికి తిప్పుకుంటుండ్రు. ఇట్ల రోజు మంథనికి వస్తే.. ఊర్ల పనులు ఎట్లా చేసుకోవాలె? – కొట్టాల మల్లయ్య, రైతు, నాగేపల్లి, పెద్దపల్లి జిల్లా

ఏమన్న అప్పు అడుగుతున్నమా?

నా ఖాతాలో పైసలున్నయి. విత్తనాలు, ఎరువుల కోసమని డ్రా చేసుకుందామని పోయిన. రూ.50 వేలు కావాలని రాస్తే.. రూ.10 వేలే ఇచ్చిండు. ఇదేందని అడిగితే బ్యాంకుల పైసలు తక్కువగా ఉన్నాయన్నరు. ఏమన్న అప్పు ఇయ్యిమని అడుగుతున్నమా, మా పైసలు ఇచ్చేటానికి ఇట్ల చేస్తరా, సీజన్ల బ్యాంకు చుట్టూ తిరగాలంటే ఎట్ల? – నర్సింహారెడ్డి, రైతు, జంగంపల్లి, కామారెడ్డి జిల్లా

నా పైసలు ఇచ్చేటానికి తిరగాల్నా?

వడ్ల పైసలు తీసుకుందామని ఆంధ్రా బ్యాంకుకు వచ్చిన. పదెకరాల్లో వరి వేస్తున్న. విత్తనాలకు, దున్నెటానికి 50 వేలు కావాలె. ఎరువులకు పైసలు కావాలె. కానీ బ్యాంకు వాళ్లు పదివేలే ఇస్తమంటున్నరు. రోజూ బ్యాంకుకు రావాలంటె ఎట్ల, నా పైసలు నేను తీసుకుందానికి తిరగాల్నా? – మీరాల అయిలయ్య, సిరిసిల్ల జిల్లా గోపాల్రావుపల్లె

బ్యాంకుల్లో పైసలు పెట్టాలె..

నాలుగెకరాల్లో వరి వెయ్యాలె. దున్నటానికి, విత్తనాలకు, నాట్లకు, మందు బస్తాలకు రూ.60 వేలు ఖర్చయితది. అకౌంట్ల ఉన్న పైసలు తీసుకుందామని కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు పోయిన. 60 వేలు కావాలంటే 20 వేలే ఇచ్చిండ్రు. ఇదేందంటె.. అందరికి అట్లనే ఇస్తున్నమని పంపించిండ్రు. సీజన్​ వచ్చింది. సర్కారు అన్ని బ్యాంకుల్లో పైసలు ఉండేటట్టు చూడాలె. – భూక్యా రవినాయక్, రాఘవయ్యపల్లి, భూపాలపల్లి జిల్లా