
- సర్వే రిపోర్ట్ ఇచ్చామంటున్న రెవెన్యూ ఆఫీసర్లు.. ఇవ్వలేదంటున్న పంచాయతీ వర్గాలు
- మామిడిపల్లి పల్లె ప్రకృతివనంపై వీడని సస్పెన్స్
- 1.09 ఎకరాల ప్రభుత్వ భూమిలో అర ఎకరం ప్రైవేట్ పరం
సంగారెడ్డి/కంది, వెలుగు : ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా దాదాపు రూ.2 కోట్ల విలువైన సర్కారు భూమి ప్రైవేట్ వ్యక్తుల పాలయ్యింది. రెవెన్యూ, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని ఓ టీఆర్ఎస్ లీడర్ ఆసరా చేసుకొని ఏకంగా పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించిన భూమిలో అర ఎకరం కబ్జా చేశాడు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన జిల్లా అధికారుల దృష్టికి రాకుండా ఇంతకాలం మండల స్థాయిలోనే కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తీరా విషయం బయటికి పొక్కడంతో తప్పు తమది కాదంటే తమదికాదని ఆ రెండు శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
జరిగింది ఇదీ...
సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్484లో 1.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆ భూమిని ప్రకృతి వనానికి అప్పటి కలెక్టర్ హనుమంతరావు కేటాయించారు. ఈ స్థలం ఇండ్ల మధ్య ఉండడంతో స్థానిక టీఆర్ఎస్ లీడర్ ఒకరు దానికి ప్రహరీ నిర్మించి కబ్జా చేశాడు. అయితే దీనిపై అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు తమకు రిపోర్ట్ ఇవ్వలేదని గ్రామ సెక్రటరీ శ్రీధర్ స్వామి చెబుతున్నారు. కానీ స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి మాత్రం రిపోర్ట్ ఇచ్చామంటున్నారు. ఇదిలా ఉంగా ఎకరా తొమ్మిది గుంటల ప్రభుత్వ భూమి క్రమంగా కబ్జాకు గురవుతున్నా సంబంధిత ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడటంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారంపై స్థానిక సర్పంచ్ మౌనం వహించగా, పాలకవర్గంలోని కొందరు సభ్యులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికార పార్టీ లీడర్ కబ్జా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని గ్రామస్తులకు ప్రకృతి వనాన్ని అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
రిపోర్ట్ అందలె..
గ్రామంలోని సర్వే నంబర్ 484 లోని 1.09 ఎకరాలకు సంబంధించి తమకు ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టు అందలేదు. సర్వే చేసినప్పుడు హద్దులు ఒక చోట చూపించి మరోచోట ముగ్గు వేయడంతో అప్పట్లో రిపోర్ట్ తీసుకోలేదు. ఇప్పటివరకు ఆ సమస్య అలాగే ఉంది. పైగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. రెవెన్యూ వారి సర్వే రిపోర్ట్ ఆధారంగానే ప్రకృతి వనం నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి.
- శ్రీధర్ స్వామి, సెక్రటరీ, మామిడిపల్లి
రిపోర్టు ఇచ్చాం..
మామిడిపల్లి సర్వే నంబర్ 484కు సంబంధించిన ప్రకృతి వనం నిర్మాణానికి సర్వే రిపోర్ట్ ఇచ్చాం. అక్కడే కొంత భాగంలో మొక్కలు నాటారు. కబ్జా వ్యవహారం నా దృష్టికి రాలేదు. పేపర్ లో చూపించిన సర్వే రిపోర్టుకు క్షేత్రస్థాయిలో చూపిస్తున్న భూమికి తేడాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటాం.
- విజయలక్ష్మి, తహసీల్దార్, కంది