యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీల మూసివేత

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీల మూసివేత

ఇండియా - పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. పహల్గాం దాడితో భారత సహనాన్ని పరీక్షించిన పాకిస్తాన్ కు.. ఆపరేషన్ సిందూర్ తో భారత్ బుద్ధి చెప్పడం.. దానికి ప్రతీకారం తీసుకోవాలని పాక్ మిస్సైల్స్ ప్రయోగించడం.. పాక్ ఆర్మీ, టెర్రర్ క్యాంపులను భారత్ ధ్వంసం చేయడం.. పాక్ ఫైటర్ జెట్లను పంపడం.. ఇండియన్ ఆర్మీ న్యూట్రలైజ్ చేయడం.. ఇలా వరుస ఇన్సిడెంట్లతో యుద్ధం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. 

గురువారం (మే 8) జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్స్, మిస్సైల్స్ లను పాక్ ప్రయోగించింది. సాయత్రం నుంచే కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ ధీటైన సమాధానం చెప్పింది. పాక్ ఫైటర్ర జెట్లను కూల్చేసింది. ఈ పరిస్థితుల్లో బార్డర్ ఏరియాల్లో పూర్తిగా కరెంటు ఆఫ్ చేసి బ్లాకౌట్ ప్రకటించింది. 

బార్డర్ లో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా.. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో శుక్రవారం (మే 9) స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. జమ్ము, కతువా, రజౌరి, పూంచ్ జిల్లాలలో విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు డివిజినల్ కమిషనర్ ప్రకటించారు. రాజస్థాన్ లోని బార్డర్ ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తు్న్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. బార్మర్ , బికనేర్, శ్రీ  గంగా నగర్, జైసల్మేర్ జిల్లాలో సెలవులు ప్రకటించారు. 

ఇక సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. పాక్, ఇండియా మధ్య మొదలైన యుద్ధం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవల కింద యదావిధిగా ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించింది.