అగ్గువకు ఆయిల్... 68 డాలర్లకు తగ్గిన రష్యా క్రూడ్ ధర

అగ్గువకు ఆయిల్... 68 డాలర్లకు తగ్గిన రష్యా క్రూడ్ ధర

న్యూఢిల్లీ:ఉక్రెయిన్​తో యుద్ధం కారణంగా ఇండియాకు రష్యా నుంచి కారు చవకగా క్రూడాయిల్​ వస్తోంది.  సంవత్సరం క్రితం ఉక్రెయిన్‌‌పై మాస్కో దాడి చేసినప్పటి నుంచి ఇది తగ్గుతూ వస్తోంది. జూన్‌‌లో ధరలు అత్యల్పస్థాయికి పడిపోయాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, సరుకు రవాణా ఖర్చులతో సహా ఒక్కో బ్యారెల్ ధర జూన్‌లో 68.17 డాలర్లకు తగ్గింది. ఇది ఈ ఏడాది మేలో 70.17 డాలర్లు కాగా,  అంతకు ముందు సంవత్సరం 100.48 డాలర్లు ఉండేది. మాస్కోపై పాశ్చాత్య దేశాలు విధించిన 60 డాలర్ల పరిమితి కంటే ఈ ధర ఎక్కువగానే ఉంది. 

యుద్ధం తర్వాత ఇండియా, చైనాలు రష్యన్ క్రూడ్​ను పెద్ద ఎత్తున కొంటున్నాయి. ప్రపంచంలో రష్యన్​ క్రూడ్​ను అత్యధికంగా కొంటున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. కేప్లర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. గత రెండు నెలలుగా రష్యా నుంచి ఇండియా దిగుమతులు తగ్గిపోతున్నాయి. ఒపెక్​ ప్లస్​ దేశాలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా ఎగుమతులను భారత ప్రభుత్వం తగ్గించుకుంటోంది. 

ఆగస్టులోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.  ఇదే ఏడాది అక్టోబర్ నుంచి మాత్రం ఇండియాకు  ఎగుమతులు పుంజుకుంటాయని కేప్లర్​ పేర్కొంది. ఇండియా సాధారణంగా రష్యన్ ముడి చమురును సరుకు రవాణా, బీమా,  ఇతర ఇతర ఖర్చులతో సహా డెలివరీ ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంది. ఇది షిప్‌‌మెంట్ ధర పరిమితి కంటే తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా  క్రూడ్‌‌ రవాణాలో కష్ట నష్టాలను అమ్మకందారుడికే వదిలేస్తుంది.  

ప్రభుత్వ లెక్కల ప్రకారం, జూన్‌‌లో ఇరాక్ నుంచి వచ్చిన క్రూడాయిల్​ బ్యారెల్‌‌కు సగటున 67.10 డాలర్లు ఉండగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన క్రూడాయిల్​ ధర 81.78 డాలర్ల వద్ద ఉంది. భారతదేశం తన చమురు డిమాండ్ అవసరాలలో 88 శాతం తీర్చడానికి దిగుమతులపై ఆధారపడుతుంది.  సప్లైలను తగ్గించాలని రష్యా,  సౌదీ అరేబియా నిర్ణయించడంతో ఇటీవలి వారాల్లో గ్లోబల్ బెంచ్‌‌మార్క్ క్రూడ్‌ ధరలు పెరిగాయి.