- నలుగురిని అరెస్ట్ చేసిన దుండిగల్ పోలీసులు
- రూ.8.5 లక్షలు, ఎయిర్ గన్, కత్తి స్వాధీనం
దుండిగల్, వెలుగు: తాము చెప్పిన పూజ చేస్తే డబ్బులు రెండింతలు అవుతాయని ఓ ముఠా పలువురిని నమ్మించింది. ఇందుకోసం కొంత ఖర్చవుతుందని చెప్పింది. అలా ఓ చోట పూజ చేసినట్లు నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకుని ఉడాయించింది. ఈ ముఠాలో నలుగురిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిందితులను మీడియాకు చూపించి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. బహదూర్ పురాకు చెందిన చెందిన మహమ్మద్ ఇర్ఫాన్(44), ఫిలింనగర్ కు చెందిన గుగులోతు రవీందర్(40), సూరారానికి చెందిన కావికా సాయిబాబ(41), ఖైరతాబాద్ కు చెందిన ఠాకూర్ మనోహర్ సింగ్(39), ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అబ్దుల్ కయ్యూం ముఠాగా ఏర్పడ్డారు.
పూజల పేరుతో డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయ్యారు. బారిష్ అనే పూజ చేస్తే ఇంట్లో సంపద రెండింతలు అవుతుందని నమ్మిస్తూ మోసాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా పలువురిని పూజ పేరుతో నమ్మించారు. ఈ నెల 18న దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ మహావీర్ కాంప్లెక్స్ వద్ద బర్షాత్ పూజ చేయాలని పలువురిని పిలిచారు. డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి వారి వద్ద రూ.25 లక్షలు తీసుకున్నారు.
పూజ చేసిన అనంతరం మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. దీంతో బాధితులు మూర్చ వచ్చి పడిపోయారు. వెంటనే నిందితులు రూ.25 లక్షలతో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు ఈ నెల 21న దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్త ప్రారంభించిన పోలీసులు ఆదివారం సాయంత్రం నలుగురు నిందితులను గండి మైసమ్మ చౌరస్తాలో పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఎయిర్ గన్, కత్తి, రూ.8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కయ్యూ పరారీలో ఉన్నాడు.
