- దుండిగల్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు డీజీపీ ప్రశంస
హైదరాబాద్ సిటీ, వెలుగు: దుండిగల్ పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తెలుగులో చార్జ్ షీట్ దాఖలు చేసి పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో హెడ్ కానిస్టేబుల్ స్వరూప 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులో అభియోగపత్రం కోర్టుకు సమర్పించారు. మొదటి కేసులో బౌరంపేటకు చెందిన వెంకటేశ్ అక్రమంగా మద్యం నిల్వలు కలిగి అమ్మకాలు జరుపుతుండగా, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు స్వాధీనం చేశారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో అభియోగపత్రం మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌కు సమర్పించారు.
మరో కేసులో వలస కూలీ అయిన 35 ఏండ్ల మహిళ తన 4 సంవత్సరాల కూతురితో అర్ధరాత్రి అదృశ్యమైన సందర్భంలో భర్త ఫిర్యాదుపై వేగంగా స్పందించి కేసు ఛేదించి మహిళ, పాపను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు తుది నివేదికను ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా తెలుగులో దర్యాప్తు పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
ఫలితంగా ఇటీవల తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బంజారాహిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సమక్షంలో 50 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసలు అందుకున్న సైబర్ యోధుల్లో ఒకరిగా నిలిచారు.
