
- చెత్తను స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలి
- లేదంటే ఫైన్లు.. మారకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దు
- కమర్షియల్ ఏరియాల్లో చెత్త నిర్వహణపై బల్దియా దృష్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కమర్షియల్ ఏరియాల్లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు ఇక నుంచి ప్రతి షాపు ముందు డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోవాలని బల్దియా ఆదేశించింది. ఆ డస్ట్ బిన్లలో వేసిన చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే వేయాలని ఆదేశించింది. దీన్ని పక్కాగా అమలు చేసేందుకు ఓ యాప్ రూపొందించింది. దీన్ని ఉన్నతాధికారులు మానిటరింగ్ చేయనున్నారు. డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోని షాపులకు ఫైన్లు వేయాలని, అప్పటికీ మారకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గ్రేటర్లో 118 కమర్షియల్ రోడ్లు
గ్రేటర్ పరిధిలో రెండేండ్ల క్రితం వరకు 66 కమర్షియల్ రోడ్లు ఉండగా, మరో 118 ఏరియాలను కమర్షియల్రోడ్లుగా మార్చింది. గ్రేటర్ లో 3 లక్షల కమర్షియల్ భవనాలున్నాయి. ప్రధానంగా పెద్ద పెద్ద హోల్ సేల్ మార్కెట్లు ఉన్న ప్రాంతాల్లో చెత్త భారీగా ఉత్పత్తి అవుతోంది. ఇలాగే మదీనా, సుల్తాన్ బజార్, ట్రూప్బజార్, చెప్పల్ బజాల్, జగదీశ్ మార్కెట్ లాంటి అనేక ప్రాంతాల్లో చెత్త సమస్య ఉంది. ఈ ప్రాంతాల్లో షాపుల మందు డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకుంటే ఆ చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా తరలించి సమస్యను తగ్గించాలని బల్దియా భావిస్తోంది.
త్వరలో యాప్ లాంచ్
కమర్షియల్ ప్రాంతాల్లో షాపుల ముందు డస్ట్ బిన్ల ఏర్పాటు, చెత్త తరలింపు పర్యవేక్షణ కోసం బల్దియా ప్రత్యేకంగా ఓ యాప్ తయారు చేయించింది. దీన్ని శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకున్నాక వారి వివరాలను యాప్ లో ఎంటర్చేస్తారు. డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రతిసారి ఈ యాప్ లో నమోదు చేస్తారు. ఇలా పలుమార్లు చూసిన తర్వాత ఉన్నతాధికారులు జరిమానాలు విధించనున్నారు. అప్పటికీ స్పందించని వారి లైసెన్సులు రద్దు చేసి సీజ్చేస్తారు.