యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం... రెండో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం... రెండో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు
  • భేరిపూజతో దేవతలకు ఆహ్వానం పలికిన అర్చకులు
  • నేడు మత్స్యావతారం, శేషవాహనసేవ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, భేరిపూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు, యజ్ఞాచార్యులు ప్రత్యేక పూజలతో యజ్ఞశాలలో హోమం కాల్చి, వేదపారాయణికులతో చతుర్వేద పారాయణాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల నడుమ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. 

ఇందులో భాగంగా తెల్లటి వస్త్రంపై గరుడాళ్వారుల ప్రతిమను చిత్రించి ప్రధానాలయ ముఖ మంటపంలో ఉన్న బంగారు ధ్వజస్తంభానికి అలంకరించారు. అనంతరం గరుడ ముద్దలను గాలిలోకి ఎగురవేస్తూ, నారసింహుడి కల్యాణానికి సకల దేవతలకు ఆహ్వానం పంపించారు. సాయంత్రం ఆలయంలో భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం వేదోక్తంగా ‘హవనం’ జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ హనుమంతరావు, ఆలయ చైర్మన్‌‌ నర్సింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు పాల్గొన్నారు.

నేడు మత్స్యావతారంలో కనిపించనున్న నారసింహుడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఊరేగించనున్నారు. రాత్రి 8.30 గంటలకు స్వామి వారిని శేషవాహనంపై అధిష్ఠింపజేసి ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించనున్నారు.