ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్.. మెట్రోలో మంత్రుల జర్నీ

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్.. మెట్రోలో మంత్రుల జర్నీ

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా అందుబాటులోకి వచ్చిన కామన్ పాస్‌పై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.

ప్రజా భవన్ నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో ప్రయాణించిన వారు.. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజా రవాణా సేవలు, ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలు, ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌పై ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

మెట్రో ప్రయాణం అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అదే కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సులో మంత్రులు సచివాలయానికి వెళ్లనున్నారు. ఆర్టీసీ, మెట్రో సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే సౌకర్యం ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.