పడకేసిన ‘ఈ–-పంచాయతీ’మొరాయిస్తున్న పాత కంప్యూటర్లు 

పడకేసిన ‘ఈ–-పంచాయతీ’మొరాయిస్తున్న పాత కంప్యూటర్లు 

 

  • ఆపరేటర్లకు మూడు నెలలుగా అందని జీతాలు 
  • పల్లెల్లో అంతంతే డిజిటల్ సేవలు 
  • మీ సేవా సెంటర్లపైనే ఆధారపడుతున్న ప్రజలు
  • దూర ప్రయాణాలు, ఫీజుల పేరిట దోపిడీతో అవస్థలు 

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పాలనను పారదర్శకంగా మార్చాలని, ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రవేశపెట్టిన ‘ఈ–-పంచాయతీ’ వ్యవస్థ ప్రస్తుతం స్తంభించిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డాక 2015-–16లో ‘డిజిటల్ తెలంగాణ’ నినాదంతో ప్రారంభమైన ఈ వ్యవస్థ.. పదేళ్లు తిరగకముందే సమస్యలతో సతమతమవుతోంది. సర్కారు నిర్లక్ష్యం, నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామాల్లో సామాన్యులకు అందాల్సిన డిజిటల్ సేవలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రజలు మీ సేవా  కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 12,702 పంచాయతీల్లో ఈ– పంచాయతీ విధానం అమలవుతోంది.  ఇందుకోసం1,450 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 32 మంది జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇద్దరు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సేవలందిస్తున్నారు. పల్లెలను క్లస్టర్ల వారీగా విభజించి ఈ–పంచాయతీ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఆపరేటర్లను నియమించడం వ్యయంతో కూడుకున్నది కావడంతో ఐదారు గ్రామాలను క్లస్టర్లుగా చేసి పౌర సేవలందిస్తున్నారు. అయితే.. పదేళ్ల క్రితం ఈ-–పంచాయతీ కోసం అందజేసిన  కంప్యూటర్లు ఇప్పుడు పాతబడటంతో మొరాయిస్తున్నాయి.

దీంతో పల్లెల్లో సేవలు స్తంభించిపోతున్నాయి. మదర్ బోర్డులు పాడవ్వడం, మానిటర్ల సమస్యలు, కీబోర్డులు పని చేయకపోవడంతో ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు. పోనీ రిపేర్లు చేయిద్దామంటే పంచాయతీల దగ్గర పైసా ఫండ్ లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు కూడా తోడవ్వడంతో ఆన్‌‌‌‌లైన్ పోర్టల్స్ ఓపెన్ కావడమే గగనంగా మారింది. కంప్యూటర్లు పని చేయకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సుల వంటి సుమారు 30 రకాల సేవలకు విఘాతం కలుగుతోంది.   

చాలీచాలని జీతాలతో ఇబ్బందులు.. 

ఈ-–పంచాయతీ వ్యవస్థలో కీలకమైన కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పంచాయతీల ఆదాయ వనరుల ఆధారంగా వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.22 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డుల కంప్యూటరీకరణ, ఉపాధి హామీ మస్టర్ల ఎంట్రీ, పంచాయతీ తీర్మానాల అప్‌‌‌‌లోడింగ్ వంటి పనులతో ఒత్తిడికి గురవుతున్న ఆపరేటర్లకు జీతాలు సకాలంలో అందడం లేదు. మూడు నెలలుగా పైసా జీతం రాకపోవడంతో ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో జీతాలు రాక ఆపరేటర్లు పని మానేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జనానికి తప్పని తిప్పలు..

గ్రామ పంచాయతీల్లో ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముతో అందాల్సిన సేవలు అందకపోవడంతో సామాన్య ప్రజలు మీ-సేవా సెంటర్ల దోపిడీకి గురవుతున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు, మీ-సేవ సెంటర్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడ ఫీజుల పేరిట జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు. పంచాయతీ ఆఫీసులో రావాల్సిన సర్టిఫికెట్ కోసం బయట వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పల్లె జనం వాపోతున్నారు.

అలాగే, ఉపాధి హామీ కూలీల పేమెంట్ వివరాలు, గ్రామానికి వచ్చే నిధుల ఖర్చుల వివరాలు తెలుసుకునే వీలు కూడా లేకుండాపోయింది. అందుకే పాత కంప్యూటర్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, ఆపరేటర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వస్తున్నా.. ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఈ-పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.