డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్‌‌ యాక్షన్ ప్లాన్‌‌

డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్‌‌ యాక్షన్ ప్లాన్‌‌
  •     డ్రగ్‌‌ కంట్రోల్‌‌, పీసీబీ, ఫ్యాక్టరీస్‌‌ అధికారులతో సమావేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్‌‌తో పాటు ఇతర మత్తుపదార్థాల కట్టడికి ఈగల్ ఫోర్స్‌‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫార్మా ఇండస్ట్రీస్‌‌లో అక్రమంగా తయారు చేస్తున్న  సైకోట్రోపిక్ పదార్థాలను అరికట్టేందుకు గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈగల్‌‌ ఫోర్స్‌‌ డైరెక్టర్ సందీప్ శాండిల్యా అధ్యక్షతన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీల శాఖ, ఎక్సైజ్ శాఖతో కలిసి బంజారాహిల్స్‌‌లోని ఈగల్‌‌ఫోర్స్‌‌ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీఏ డీజీ షానవాజ్‌‌ ఖాసీం, టీజీ పీసీబీ చీఫ్ ఎన్విరాన్‌‌మెంటల్ ఇంజనీర్ బి.రఘు, డిప్యూటీ చీఫ్ ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో సింథటిక్‌‌, కొత్త తరహా డిజైనర్‌‌ డ్రగ్స్‌‌ తయారీని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫార్మా డ్రగ్స్‌‌ నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా తయారవుతున్నాయా ? లైసెన్స్ పొందిన యూనిట్లు దుర్వినియోగానికి గురవుతున్నాయా? అనే అంశాలపై కీలకంగా ప్రస్తావించారు. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై నిఘా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరంతర తనిఖీలతో పాటు కెమికల్ రియాక్టర్లు, పరిశ్రమల మౌలిక వసతులను అద్దెకిచ్చే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.