
- క్యాంపస్‌లో స్టూడెంట్లకు గంజాయి సిగరెట్లు, డ్రగ్స్ అమ్మకాలు
- 14 మందికి పరీక్షలు నిర్వహించిన ఈగల్ టీమ్.. ఐదుగురికి పాజిటివ్
- డ్రగ్స్ కస్టమర్ల లిస్టులో 50 మంది విద్యార్థులు
- ఇద్దరు స్టూడెంట్లు, ఇద్దరు సప్లయర్ల అరెస్ట్
- 1.15 కిలోల గంజాయి,47 గ్రాముల ఓజీ వీడ్ గంజాయి సీజ్
హైదరాబాద్, వెలుగు: కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫోర్స్) టీం రట్టు చేసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు గంజాయి చేరవేస్తున్న ముగ్గురు స్టూడెంట్లు సహా నలుగురు సభ్యుల ముఠాను సోమవారం అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ గంజాయి స్వాధీనం చేసుకుంది.
50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించింది. 14 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా.. ఐదుగురు విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఓ నైజీరియన్ పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్ చేరవేస్తున్నట్టు ఈగల్ దర్యాప్తులో వెల్లడైంది. ఎస్పీ రూపేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మంగళవారం వెల్లడించారు.
కొంపల్లి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు లింక్‌లతో కదులుతున్న డొంక
మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాను జులై 7న ఈగల్ ఫోర్స్ ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ ముఠాల డొంక కదులుతోంది. చైన్ సిస్టమ్‌తో సాగుతున్న దందాలో మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల లింకులు బయటపడ్డాయి. యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రంగా ముగ్గురు విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్టు ఈగల్ దర్యాప్తులో వెల్లడైంది. శ్రీమారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేశ్, ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థల లింకులు బయటకు వచ్చాయి.
వీటి పేర్లతో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రెండు డ్రగ్స్ పార్సిల్స్ డీటీడీసీ కొరియర్ ద్వారా వచ్చినట్టు ఈగల్ అధికారులకు సమాచారం అందింది. ఆ పార్సిల్‌పై ఉన్న మొబైల్ నంబర్లు ఇండియన్ నంబర్లు అయినప్పటికీ.. నిక్ అనే నైజీరియన్ వాడుతున్నట్టు గుర్తించారు. నిక్ ఢిల్లీ నుంచి పంపిన పార్సిల్స్ రెండు హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు దినేశ్, భాస్కర్ కు చేరినట్టు డెలివరీ బాయ్స్ ద్వారా ఈగల్ టీమ్ పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తుండగా, మరొకరు పార్సిల్స్‌ను తీసుకుంటున్నట్టు గుర్తించారు.
ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ డ్రగ్స్ గ్యాంగ్‌తో లింకులు
మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు దినేశ్, భాస్కర్ కలిసి గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్‌ను సైతం విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే అదే యూనివర్సిటీలో చదువుతున్న మణిపూర్‌కు చెందిన నెవెల్ టాంగ్‌బ్రామ్(51) సూరారంలో రెంటెడ్ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఢిల్లీలోని అరవింద్ శర్మ, అనిల్ సోయిబామ్ నుంచి ఓజీ వీడ్ గంజాయిని డీటీడీసీ కొరియర్ ద్వారా తెప్పిస్తున్నాడు.
యూపీఐ పేమెంట్స్ ద్వారా కాలేజ్ ఫ్రెండ్స్‌కు సప్లయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జీడిమెట్లలో నివాసం ఉండే బూస శివకుమార్ (26) బీదర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి అదే ప్రాంతానికి చెందిన అంబటి గణేశ్(24)కు విక్రయిస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన గంజాయిని గణేష్ 4 గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నాడు. వీటిని యూనివర్సిటీ స్టూడెంట్స్ సహా స్థానికులకు విక్రయిస్తున్నాడు.
గంజాయి సిగరెట్‌కు రోజుకు రూ.2,500 ఖర్చు చేస్తున్న విద్యార్థులు
ఢిల్లీకి చెందిన మహ్మద్ అశర్ జావేద్ ఖాన్(21) మహీంద్రా యూనివర్సిటీలోనే చదువుతున్నాడు. మణిపూర్‌కు చెందిన విద్యార్థి నెవెల్ తో కలిసి క్యాంపస్‌లో గంజాయి సహా పలు రకాల సింథటిక్ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. ఇందుకు గాను ఢిల్లీ, గుర్‌గామ్ నుంచి ఇండియా పోస్ట్ కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలు డెలివరీ చేసుకుంటున్నారు. బీదర్ నుంచి కొనుగోలు చేసిన గంజాయిని సిగరెట్స్‌గా మార్చుతున్నారు. బల్క్‌గా తెచ్చిన గంజాయిని నాలుగు గ్రాములకు ఒక ప్యాకెట్ చొప్పున విభజించి , ఒక్కో ప్యాకెట్‌ను రూ.500లకు విక్రయిస్తున్నారు.
ఢిల్లీ నుంచి తెచ్చిన నాణ్యమైన గంజాయి ఓజీ 28 గ్రాములు ( ఒక ఔన్స్) రూ. 30 వేలకు కొనుగోలు చేసి, 1 గ్రామును రూ.2,500 చొప్పున విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక గ్రాము గంజాయితో రెండు సిగరెట్లు తయారు చేసి సప్లయ్ చేస్తున్నారు. వీటి కోసం ఒక్కో విద్యార్థి రోజుకు సగటున రూ.2,500 ఖర్చు చేస్తున్నాడు. హాస్టళ్లలో, ప్రైవేట్ సమావేశాలలో ఈ ముఠా విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నది. ఈ డ్రగ్ రాకెట్‌లో నెవెల్ టాంగ్‌బ్రామ్, అంబటి గణేశ్, బూసా శివ కుమార్, మహ్మద్ అషర్ జావెద్ ఖాన్‌ను అరెస్టు చేసినట్టు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు