చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి.. వాటిని కరిగిస్తే వరదలే..

చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి.. వాటిని కరిగిస్తే వరదలే..

చంద్రుడిపై నీటి వనరులున్నాయిన అందరికి తెలుసు. చందమామపై నీళ్లు ఉన్నాయని భారత్ తో పాటు..అనేక దేశాలు పరిశోధనలు జరిపాయి.  చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తేల్చాయి. కానీ వాతావరణమే లేని చంద్రుడిపై నీటి వనరులు  ఎలా ఏర్పడ్డాయని మాత్రం ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త వెల్లడించలేకపోయాడు. అయితే చంద్రుడిపై నీటి వనరులు ఎలా ఏర్పడ్డాయన్న రహస్యాన్ని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ వల్లే చంద్రుడిపై నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 1 సేకరించిన డేటా నుంచి ఈ విషయాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఎలా కనుగొన్నారంటే..

చంద్రయాన్‌-1 మిషన్‌లోని ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ అయిన మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ పరికరం సేకరించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను అమెరికాలోని మనోవాలో గల యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.  భూ వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్స్‌.. చందమామపై నీళ్లు ఏర్పడటానికి దోహదం చేశాయని తేల్చారు. చంద్రుడిపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ ప్రక్రియలకు ఈ ఎలక్ట్రాన్స్‌  దోహదం చేసి ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Also Read :- సూర్యుడి సమీపంలోకి ఆదిత్య ఎల్ 1 నాలుగో భూకక్ష్య పెంపు సక్సెస్

చందమామపై  నీటి వనరులు ఉన్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. ప్రోటాన్ల లాంటి అధిక శక్తి అణువులు ఉండే సౌరగాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించాయి. అయితే  భూఅయస్కాంతావరణం గుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సౌరగాలి చంద్రుడిని తాకడం కష్టం. అలాంటి సమయంలో చంద్రుడి ఉపరితల వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉంటాయన్న దానిపై తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హవాయి  శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అయితే చంద్రయాన్‌-1 సేకరించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను పరిశీలిస్తే... భూఅయస్కాంతావరణంలో చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు కూడా అక్కడ చంద్రుడిపై  నీరు ఏర్పడినట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.  సౌరగాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే  చందమామపై నీరు ఏర్పడే అదనపు మార్గాలున్నాయని తెలిసిందన్నారు.