బంగాళాఖాతంలో భూకంపం.. సముద్రం అల్లకల్లోలం.. సునామీ వస్తుందా..?

బంగాళాఖాతంలో భూకంపం.. సముద్రం అల్లకల్లోలం.. సునామీ వస్తుందా..?

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. మంగళవారం ఉదయం 07 గంటల 26 నిమిషాలకు బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 35 కిలో మీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం ధాటికి సముద్రంలో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటివరకు ఎటువంటి నష్టం సంభవించలేదు. మంగళవారం 75 కి.మీ లోతులో 3.9 తీవ్రతతో తజికిస్తాన్లో కూడా భూకంపం సంభవించింది.

ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం ఉదయం 7 గంటల 36 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 90 కిలోమీటర్ల లోతులో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించడం గమనార్హం. సోమవారం తెల్లవారుజామున 3:52 గంటలకు టిబెట్‌లో 50 కిలోమీటర్ల లోతులో 3.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇలా దక్షిణ, మధ్య ఆసియాలోని అనేక ప్రాంతాలలో ఇటీవల తరచుగా భూకంపాలు సంభవిస్తుంటం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో 75 శాతం మంది భూకంప ముప్పులో ఉన్నట్లు ఇప్పటికే తేలింది. 59 నుంచి 61 శాతం భూభాగం మధ్యస్థ నుంచి అధిక ప్రమాదకర జోన్‌ పరిధిలో ఉన్నట్లు వెల్లడైంది. పలు సవరణలతో కొత్తగా సీస్మిక్ జోనేషన్​ మ్యాప్​ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రూపొందించింది. భూకంపానికి సంబంధించి ఇప్పటివరకు మనదేశంలో మొత్తం ఐదు జోన్లు ఉండగా.. ఇప్పుడు 6వ జోన్​ను యాడ్​ చేశారు. భూకంపం తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాలను ఈ 6వ జోన్​లో చేర్చారు.

ఇందులో మొత్తం హిమాలయ శ్రేణి ఉంది. గతంలో హిమాలయ ప్రాంతం జోన్ 4, 5గా విడిపోయి ఉండేది. కానీ, ప్రస్తుతం హిమాలయ శ్రేణి డేంజర్‌‌లో ఉన్నట్లు తాజా మ్యాప్​తో తెలుస్తున్నది. తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్​ సేఫ్​ జోన్​ (2వ జోన్​)లో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. బెంగళూరు, రాయ్​పూర్​, పనాజీ వంటి ప్రాంతాలు కూడా ఈ సేఫ్​ జోన్​ పరిధిలోనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 4వ జోన్‌‌లో ఉంది.