అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

బషీర్ బాగ్: హైదరాబాద్‌లో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసామని చెప్పారు న‌గ‌ర పోలీస్ కమిషనర్ అంజని కుమార్. గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చైన్ స్నాచింగ్ ముఠా ప్రధాన సూత్రధారి శంకర్రావు అనే వ్య‌క్తిని అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు. లంగర్ హౌస్, ఎస్ ఆర్ నగర్, కాచిగూడ పి.ఎస్. పరిధిలో న‌మోదైన చైన్ స్నాచింగ్ కేసుల‌కు సంబంధించి చిక్కుముడి వీడింద‌ని వెల్ల‌డించారు. పూణే కి చెందిన శంకర్ రావు న‌గరంలోని ‌కాటేదన్ లో నివాస‌ముంటూ.. రెక్కీ చేసి ఈ చోరీలు చేస్తున్నాడ‌ని చెప్పారు. ముఠా నుండి బంగారు ఆభరణాలు(రెండు 5.5 తులాల మంగళ సూత్రాలు), బైక్ (150సీసీ బజాజ్ పల్సర్ ) స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు‌.

శంక‌ర్రావు పై ‌మహారాష్ట్ర లో 47 కేసులు ఉన్నాయని, గ‌తంలో అక్కడి పోలీసులు అతన్ని  పుణె సిటీలో అరెస్ట్ చేశార‌ని సీపీ అన్నారు. అత‌నిపై 37 గొలుసు దొంగతనాలు, 14 బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయని.. ఈ కేసుల్లో పుణె లోని ఏర్రవడ జైల్ లో శిక్ష కూడా పడిందని చె‌ప్పారు. బయటకు వచ్చిన తరువాత మళ్ళీ చోరీ లు మొద‌లు పెట్టాడ‌ని.. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుని చోరీ లకు పాల్పడుతున్నట్టు తెలిపారు. నిందితుణ్ని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామ‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు సీపీ  తెలిపారు.

100కి డయల్ చేయండి
టెక్నాలజీ వాడడం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోయాయని సీపీ అన్నారు. హైదరాబాధ్ సీసీఎస్ లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, సైబర్ నేరాలకు పాల్పడిన నేరస్తులు వేరే ప్రాంతాల్లో ఉన్నా వారిని వదిలిపెట్టమని స్పష్టం చేసారు. షి టీమ్స్, సైబర్ టీం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోటో లు సెండ్ చేయడం సరికాదని సలహా ఇచ్చారు. పేరెంట్స్ , ముఖ్యంగా అమ్మాయిలు చుట్టూ జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమానం, సందేహం, సహాయం కావాలన్నా100కి డయల్ చేయాలని తెలిపారు.

నంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కేసు..
న‌గ‌ర వాసులంతా త‌మ వాహనాల నంబర్ ప్లేట్ సరిచూసుకోవాల‌న్నారు సీపీ. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాద‌ని, అలా నడిపితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో రౌడీల పరివర్తనలో మార్పు వస్తే వారిపై‌ రౌడీ షీటర్ తొలగిస్తామ‌ని అన్నారు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

east zone task force police arrested Interstate chain snatching gang in hyderabad