కేసీఆర్ సభా ఉల్లంఘనకు పాల్పడుతున్నరు

కేసీఆర్ సభా ఉల్లంఘనకు పాల్పడుతున్నరు
  • సభా ఉల్లంఘనకు కేసీఆర్ పాల్పడుతున్నరు: ఈటల
  • సీఎం కనుసన్నల్లో స్పీకర్ పనిచేస్తున్నరని ఫైర్
  • అన్నింటికీ సిద్ధమయ్యే అసెంబ్లీకి పోతం: రఘునందన్
  • సీఎం పాపాలను బయటపెడుతమనే సస్పెండ్ చేసిన్రు: రాజాసింగ్


హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ముఖ్యమంత్రే సభా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ముందు ఆయన్ను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ చైర్.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నదని ఆరోపించారు. స్పీకర్ గా ఎన్నికైన వారు ఏ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించరాదని, కానీ ఈ స్పీకర్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌‌‌పై సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్‌‌‌‌తో కలిసి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నమ్మకం కోల్పోయిన వ్యక్తి దేశ్ కీ నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. బీజేపీని కాదు.. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్నే బంగాళాఖాతంలో పడేయ్యాలన్నారు. కేసీఆర్ దోపిడీ చేయకపోతే, అక్రమంగా సంపాదించకపోతే యూపీ ఎన్నికల్లో సమాజ్‌‌‌‌వాదీ పార్టీ కోసం డబ్బు ఎలా పంపించారని నిలదీశారు. కేసీఆర్ తీరు చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘నువ్వు మమ్మల్ని ఎలా సస్పెండ్ చేశావో.. నిన్ను కూడా తెలంగాణ ప్రజలు అలానే సస్పెండ్ చేస్తరు. నిన్ను శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా నిషేధిస్తరు’’ అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించారు.

స్పీకర్‌‌‌‌‌‌‌‌ను కలుస్తం: రఘునందన్ రావు

హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు స్పీకర్‌‌‌‌‌‌‌‌ను కలుస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. అన్నింటికీ సిద్ధమయ్యే అసెంబ్లీకి వెళ్తామని చెప్పారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి.. రాజకీయాలు పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు సూచించిందన్నారు. సెక్షన్ 339 ప్రకారం తమను ఒక్కరోజు మాత్రమే సస్పెండ్ చేయాలని, మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తే అక్కడి హైకోర్టు ఇదే తీర్పునిచ్చిందని అన్నారు.

అసెంబ్లీలో మా గొంతు నొక్కొచ్చు.. మరి ప్రజల్లో: రాజాసింగ్

అసెంబ్లీకి ఈటల రాజేందర్ రావడమే తమను సస్పెండ్ చేయడానికి కారణమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో ఈటల ముఖం చూడకూడదనే కేసీఆర్ తమను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. సీఎం పాపాలను అసెంబ్లీలో ఈటల బయటపెడుతారని ఈ కుట్ర చేశారన్నారు. ‘‘అసెంబ్లీలో మా గొంతు నొక్కొవచ్చు.. కానీ ప్రజల్లో నొక్కలేరు. ‘ట్రిపుల్ఆర్’లం మంగళవారం అసెంబ్లీకి వెళ్తాం. అప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూద్దా’’ అని చెప్పారు.