హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్ర

హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్ర

హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గంలో ‘ప్రజా దీవెన యాత్ర’పేరుతో పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. అందులో భాగంగా రెండో రోజు యాత్ర కమలాపూర్ మండలం అంబాల గ్రామం నుంచి ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సాగుతుంది. అంబాల నుంచి గూడూరు, నేరెళ్ళ, లక్ష్మీపూర్, కాశింపల్లి, పగిడిపల్లి, వంగపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. 

రెండో రోజు పాదయాత్ర సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. ‘హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్ర జరుగుతుందని సమాచారం ఉంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది. మంత్రుల ఫోన్స్ ట్యాప్ చేసే ప్రభుత్వానికి.. నాపై జరుగుతున్న కుట్ర గురించి తెలియదా? మాజీ ఎమ్మెల్యేలకు టు ప్లస్ టు గన్‌మెన్లను ఇచ్చే సర్కార్.. కక్ష సాధింపుతో నాకు మాత్రం వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌లను మాత్రమే సెక్యూరిటిగా ఇచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చట్టానికి లోబడి కాకుండా.. చుట్టానికి లోబడి పని చేస్తున్నాడు. ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ బాధితులే. మేం పొలిటికల్ బాధితులమైతే.. వాళ్లు అఫిషియల్ సైడ్ నుంచి బాధితులు’ అని ఈటల అన్నారు.