దక్షిణాఫ్రికాలో వందల ప్రాణాలను తీస్తూ హెల్త్ ఎమర్జెన్సీకి కారణమైన ఎబోలా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మందులేని వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు దాదాపు అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అందులో భాగంగా ఎయిర్ పోర్టులలో క్వారంటైన్ ఏర్పాటు చేయడం, ఆఫ్రికా నుంచి వచ్చే వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి భయానక వాతావరణం ఉన్న పరిస్థితుల్లో బెంగళూరులో ఎబోలా కేసు వార్తలు కలకలం రేపాయి.
ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళను కెంపెగౌడ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇందిరానగర్ లోని అంటువ్యాధల నివారణ ఆసుపత్రికి తరలించారు. వ్యాధి వేగంగా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్న క్రమంలో.. ఎబోలా టెస్టింగ్ కోసం సాంపుల్స్ సేకరించి ఆమెను ప్రత్యేక వార్డుకు షిఫ్టు చేశారు.
హెల్త్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిత్విక్ రంజనమ్ పాండే ప్రకారం.. సదరు మహిళకు మరీ సీరియస్ లక్షణాలు లేకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఆమెను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే అలసట, నీరసం వంటి లక్షణాలు బయటపడటంతో ఎయిర్ పోర్టు అథారిటీ వెంటనే టెస్టులు నిర్వహించింది. సాంపుల్స్ ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపారు.
ఉగాండ నుంచి వచ్చిన మహిళ బెంగళూరులోని ఒక హోటల్ రూమ్ లో బసచేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఒళ్లు నొప్పులు, అలసట మొదలైన లక్షణాలు బయటపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె కండిషన్ నార్మల్ గానే ఉందని.. అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి పరీక్షించనట్లు తెలిపారు.
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తీవ్రమవుతున్న తరుణంలో ఈ కేసు వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (PHEIC)గా ప్రకటించింది.
