రూ. 14 వందల 44 కోట్లు.. ఇదేదో స్కాం కాదు.. 2026లో ఎన్నికల సంఘం సీజ్ చేసిన అమౌంట్

రూ. 14 వందల 44 కోట్లు.. ఇదేదో స్కాం కాదు.. 2026లో ఎన్నికల సంఘం సీజ్ చేసిన అమౌంట్

ఢిల్లీ: మన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఎంత నిఘా పెట్టినా ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనుకాడటం లేదు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఈ విషయం మరోసారి రుజువైంది.

అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 5 రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో మొత్తం 14 వందల 44 కోట్లను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 26, 2026 నుంచి మే 6, 2026 వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు వివరాలను ఎన్నికల సంఘం ప్రజల ముందు ఉంచింది.

ఫ్రీబీస్ రూపంలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచి.. ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.518 కోట్లు కాగా.. రూ.154 కోట్ల నగదును ఈసీ సీజ్ చేసింది. రూ.337 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.250 కోట్ల రూపాయల విలువైన బంగారం, ఆభరణాలు.. 7 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

2021లో ఎన్నికల సందర్భంగా.. పట్టుబడిన అమౌంట్ రూ.10 వందల 29 కోట్లు ఉండగా.. 2026 నాటికి రూ.14 వందల 44 కోట్లకు ఈ మొత్తం పెరిగింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు ఐదేళ్లలో 44 శాతం పెరిగింది.