హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు తప్పుడు వివరాలతో భారీ సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బల్క్‌గా బోగస్ ఫామ్-7లు వస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు అత్యవసర మెమో జారీ చేసింది.
తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు
ఫామ్-7తోపాటు కొత్త ఓటరు నమోదుకు ఇచ్చే ఫామ్-6, ప్రవాస భారతీయుల కోసం ఫామ్-6ఏ, సవరణలు, చిరునామా మార్పుల కోసం ఇచ్చే ఫామ్-8లోనూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఇస్తే నేరంగా పరిగణిస్తామని సీఈవో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద జరిమానాతోపాటు ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.
అయితే నేరుగా కేసులు నమోదు చేయకుండా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960లోని రూల్-20 ప్రకారం ఈఆర్వోలు ముందుగా విచారణ జరపాలని ఆదేశించారు. తప్పుడు వాంగ్మూలం ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్లు తేలితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేపట్టాలని సూచించారు.
బల్క్ దరఖాస్తులపై నిఘా
ప్రత్యర్థి వర్గాల ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు నకిలీ ఫామ్-7లు సమర్పిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులో పేర్కొన్న కారణాలు సరైనవి కావని తేలితే ఫామ్‌ను తిరస్కరించడంతోపాటు దరఖాస్తుదారుల వివరాలను రికార్డుల్లో భద్రపరచాలని ఈఆర్వోలను ఆదేశించారు. బల్క్ దరఖాస్తులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష విచారణ జరిపి అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఆదేశాల ప్రతులను గుర్తింపు పొందిన పార్టీలకు కూడా పంపాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ప్రింటెడ్ ఫామ్-7లపై విచారణ
హైదరాబాద్‌లో ముషీరాబాద్, గోషామహల్, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో చేతిరాతకు బదులు ప్రింట్ చేసిన ఫామ్-7లు పెద్ద సంఖ్యలో అందుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫామ్-7 అందిన తర్వాత బీఎల్‌వో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అనంతరం సూపర్‌వైజర్‌తో పంచనామా చేస్తారని, ఈఆర్వో నోటీసు ఇచ్చి నిర్ధారణ అనంతరమే ఓటును తొలగిస్తారని అధికారులు చెబుతున్నారు. బయట ప్రింట్ చేయించి నింపిన ఫామ్‌లను వందల సంఖ్యలో బీఎల్‌వోలకు సమర్పిస్తున్న నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
సీఈవోకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ముషీరాబాద్‌లో ఫామ్-7 దరఖాస్తుల దుర్వినియోగంపై కాంగ్రెస్ నేతలు సీఈవో సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 210లో కాంగ్రెస్ బీఎల్‌ఏ షఫీయుద్దీన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 30 మంది ఓట్లు తొలగించాలని బల్క్‌గా ఫామ్-7లు సమర్పించారని, సంబంధిత ఓటర్లు స్వయంగా దరఖాస్తులు ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, ఒరిజినల్ దరఖాస్తులను భద్రపరిచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముషీరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
