
- ఉన్నతాధికారులతో మీటింగ్‌లో ఈసీ అధికారులు
- అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో లిక్కర్, క్యాష్ పం పిణీని కంట్రోల్ చేయాలని ఈసీ బృందం స్పష్టం చేసింది. విచ్చలవిడిగా ఓటర్లను ప్రలోభపెట్టే వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలి? ఎలా ముందుకెళ్తే కట్టడి చేయగలుగుతాం అన్న విషయాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ అధికారులు చర్చించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధ తలో భాగంగా ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, ఆర్కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్ల బృందం గురవారం వివిధ శాఖల అధి కారులతో సమావేశం నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, స్టేట్ జీఎస్టీ, సీజీఎస్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎల్ఎల్ఈసీ) సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ఉన్నతాధికారులతో ఈసీ బృం దం ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎస్, రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ ఆఫీసర్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో, ఓటింగ్ సమయంలో మద్యం, నగ దు పంపిణీని ఎలా కంట్రోల్ చేయాలి? లిక్కర్ అమ్మకాలు ఎలా ఉండాలి? అన్న అంశాలపై చర్చించారు. దీంతోపాటు నగదు ఎలా తీసుకువస్తున్నారు? బ్యాంకుల్లో ఎంత డ్రా చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలి? ఆన్లైన్ వ్యవహారాలపై నిఘా వంటి వాటిని ఎలా చేపట్టాలనే దానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై సీఏపీఎఫ్, స్పెషల్ పోలీసు నోడల్ ఆఫీసర్ అధికారులతో చర్చించారు. శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతోనూ ఈసీ అధికారులు సమావేశం కానున్నారు.