తొలగించే ఓట్లపై జాగ్రత్త..గ్రామ, వార్డు సభల ద్వారా ప్రతి ఓటునూ వెరిఫై చేయాలి

తొలగించే ఓట్లపై జాగ్రత్త..గ్రామ, వార్డు సభల ద్వారా ప్రతి ఓటునూ వెరిఫై చేయాలి
  •     అర్హులైన ఓటర్ల ఓట్లు గల్లంతైతే సిబ్బందిపై చర్యలు
  •     రాష్ట్ర సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: స్పెషల్‌‌ ఇంటెన్సివ్‌‌ రివిజన్‌‌ (సర్‌‌) ప్రక్రియలో ఓట్ల తొలగింపుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను ఆదేశించింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనామలీస్‌‌, అన్‌‌మ్యాప్డ్‌‌ కేటగిరీలో ఉన్న దాదాపు 93 లక్షల ఓటర్లలో అర్హులైన ఒక్క నిజమైన ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని స్పష్టం చేసింది. ప్రతి ఓటునూ గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఈసీ సూచించింది. 

క్షేత్రస్థాయిలో బూత్‌‌ లెవల్‌‌ అధికారులు (బీఎల్‌‌వోలు) పారదర్శకంగా వ్యవహరించాలని.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌‌ లెవల్‌‌ ఏజెంట్లు (బీఎల్‌‌ఏలు), స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఓటర్ల వివరాలను వెరిఫై చేయాలని ఆదేశించింది. ఏకపక్షంగా ఓట్లను తొలగిస్తే ఉపేక్షించేది లేదని ఈసీ స్పష్టం చేసింది. రికార్డులను క్షేత్రస్థాయి పరిస్థితులతో పోల్చి చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అర్హత ఉన్న ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుతూనే.. బోగస్‌‌ ఓట్లను తొలగించి పారదర్శకమైన, దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించింది.

వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలి..

ఓటును తొలగించే ముందు సంబంధిత ఓటరుకు సహజ న్యాయసూత్రాల ప్రకారం తన వివరణ ఇచ్చుకునే పూర్తి అవకాశం కల్పించాలని ఈసీ పేర్కొంది. తనిఖీ ప్రక్రియలో ఈఆర్‌‌వోలు, అసిస్టెంట్‌‌ ఈఆర్‌‌వోలు, బీఎల్‌‌వోలు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఎక్కడైనా అర్హుల ఓట్లు గల్లంతైనట్లు తేలితే.. బాధ్యులైన సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.