- రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
- ఆర్థిక వ్యవస్థ బాగున్నా రూపాయి పడుతోంది
- గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో గోల్డ్, వెండి ధరలు మరింత పెరగొచ్చని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా ఇండియా నిలుస్తుందని యూనియన్ బడ్జెట్‌కు ముందు వెలువడే ఎకనామిక్ సర్వే పేర్కొంది. 2025–26లో జీడీపీ 7.4 శాతం పెరుగుతుందని, రానున్న ఆర్థిక సంవత్సరం (2026–27) లో 6.8–7.2శాతం వృద్ధి సాధించనుందని అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌లు కొనసాగితే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ గ్రోత్ రేటు 6.2 శాతానికి తగ్గొచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) పేర్కొన్న విషయం తెలిసిందే.
సర్వేలోని ముఖ్యమైన అంశాలు..
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–డిసెంబర్) లో ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 1.7 శాతంగా నమోదైంది. గ్లోబల్ అనిశ్చితులు, రూపాయి పతనం, కమోడిటీల ధరలు పెరగడం వంటి కారణాల వలన రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ, ఇది ఆర్‌బీఐ పెట్టుకున్న బ్యాండ్ 2–6 శాతం లోపు ఉంటుంది. ఎకానమీ స్థిరంగా ఉంటుంది.
* 2024–25లో ద్రవ్య లోటు (ఖర్చులు మైనస్ ఆదాయం) జీడీపీలో 4.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతోంది. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటు వాటా 4.4 శాతంగా ఉంటుందని అంచనా.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో రూపాయి విలువ 5 శాతం మేర పతనమైంది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నా రూపాయి పతనం కొనసాగుతోంది. కరెన్సీ వాల్యూ తగ్గడంతో టారిఫ్‌ల ఒత్తిళ్లను కొంత మేర ఎదుర్కోగలుగుతున్నాం. డాలర్‌తో రూపాయి విలువ గురువారం 91.96 వద్ద ఉంది.
* గ్లోబల్‌గా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండడంతో వెండి, గోల్డ్ వంటి కమోడిటీలకు డిమాండ్ పెరిగింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ వీటి ధరలు పెరగొచ్చు.
* గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో ఇండియా స్థానం బలపడుతోంది. గ్లోబల్‌గా జరుగుతున్న వస్తువుల ఎగుమతుల్లో ఇండియా వాటా 2024 నాటికి 1.8 శాతానికి చేరుకుంది. ఇది 2005లో నమోదైన 1 శాతం కంటే డబుల్.
* లేబర్ ఎక్కువగా అవసరమయ్యే టెక్స్‌టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి సెక్టార్లు అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ వలన దెబ్బతింటున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గింపు, ఆదాయ పన్ను సంస్కరణలు, కార్మిక చట్టాలను సులభం చేయడం, ఈయూతో సహా నాలుగు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏలు) పూర్తి చేయడం వంటి చర్యలు తీసుకుంది.
* ఇండియా మూల ధన పెట్టుబడులు 2017–18 లో కేవలం రూ.2.63 లక్షల కోట్లు ఉంటే 2025–26 (బడ్జెట్ అంచనా) లో రూ.11.21 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పెట్టుబడుల విలువ రూ.15.48 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. మూలధన ఖర్చులు (ఫండింగ్ పొందడానికి కంపెనీలు చేసే వడ్డీ వంటి ఖర్చులు) తగ్గించాలని ఎకనామిక్ సర్వే సలహా ఇచ్చింది.
* మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆదాయం జీడీపీలో 9.2 శాతంగా ఉంది. ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు జనవరి 16, 2026 నాటికి 701.4 బిలియన్ డాలర్లకు చేరాయి. 11 నెలల దిగుమతులను, 94 శాతం వరకు ఉన్న విదేశీ అప్పులను కవర్ చేయగలవు.
* రెమిటెన్స్ (ఇతర దేశాల్లోని ఇండియన్లు పంపే విదేశీ కరెన్సీ)2024–25 లో 135.4 బిలియన్ డాలర్లకు చేరాయి. రెమిటెన్స్ అందుకుంటున్న అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోంది.
* 14 సెక్టార్లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ ద్వారా రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో రూ.18.7 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ లేదా అమ్మకాలు జరిగాయి. కిందటేడాది సెప్టెంబర్ నాటికి పీఎల్‌ఐ ద్వారా 12.6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి.
* ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా రూ.1.60 లక్షల కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
* పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కమ్‌లు) మొదటిసారిగా లాభాల్లోకి వచ్చాయి. 2024–25 లో రూ.2,701 కోట్ల ప్రాఫిట్ సాధించాయి.
ఈ ఏడాదే అమెరికాతో ట్రేడ్ డీల్
అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. ట్రేడ్ డీల్ పూర్తయితే అమెరికా టారిఫ్‌ల ప్రభావం తగ్గి, ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రూపాయి పతనం ఆగడంతో పాటు, స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుంది.
సప్లయ్ చెయిన్ సమస్యలు తీరొచ్చు. టారిఫ్‌ల సవాళ్లను ఎదుర్కొనేందుకు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, స్వదేశీ బాట పట్టాలని సర్వే పిలుపునిచ్చింది. మూలధన ఖర్చులను తగ్గించడం, బ్యాంకులకే పరిమితం కాకుండా బాండ్లు వంటి ఇతర మార్గాల ద్వారా ఫండ్స్ సేకరించడం వంటి నేషనల్ ఇన్‌పుట్ కాస్ట్ రిడక్షన్ స్ట్రాటజీని ప్రతిపాదించింది.
