లిక్కర్​ స్కామ్​పై సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు

లిక్కర్​ స్కామ్​పై సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు


న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్​స్కామ్​లో కీలకమైన ఓ వ్యక్తికి సమన్లు ఇవ్వగానే అరుణ్​ రామచంద్ర పిళ్లై తన స్టేట్​మెంట్​ మార్చుకున్నారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ లో పిళ్లై కీలక వ్యక్తిగా ఉన్నారని, ఇండోస్పిరిట్ లోనూ భాగస్వామ్యం పొందారని తెలిపింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ స్కామ్​తో సంబంధం ఉన్న కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని విచారించాల్సి ఉందని, మరో మూడు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ మేరకు సోమవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది.

సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల సేకరణ

ఈ నెల 6న పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసి 7వ తేదీన సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా వారం రోజుల కస్టడీ విధించింది. ఈ గడువు సోమవారం ముగియడంతో ఈడీ అధికారులు సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట పిళ్లైని హాజరుపరిచారు. ఈడీ తరపు అడ్వొకేట్ నవీన్ కుమార్ మట్ట, జోహెబ్ ఉస్సెన్ వాదనలు వినిపించారు. పిళ్లైని మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. లిక్కర్ పాలసీకి సంబంధించి హోటల్ సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ నివేదిక ఫోన్​కు ఎలా వచ్చిందనే అంశాలపై సౌత్ గ్రూప్​లోని వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. లిక్కర్ పాలసీ సమావేశాలపై ఆయా హోటల్స్ నుంచి సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను సేకరించినట్లు నివేదించారు. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని వాట్సప్ చాట్స్ గురించి ప్రశ్నించాల్సి ఉందని, అందులో భాగంగా మార్చి 9న విచారణకు రావాలని బుచ్చిబాబుకు సమన్లు ఇచ్చామని వివరించారు. అనారోగ్య కారణాల వల్ల మార్చి 13న బుచ్చిబాబు హాజరయ్యేందుకు అంగీకరించారని, అదే రోజు పిళ్లై కస్టడీ గడువు ముగియడం, కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నందున 15న రావాలని రిప్లే ఇచ్చామని చెప్పారు. ఆ రోజు బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని విచారించాల్సి ఉందని, అందువల్ల అతడి కస్టడీని పొడగించాలని కోరారు.

మానసికంగా ఇబ్బంది పెడుతోంది: పిళ్లై తరపు లాయర్

ఇప్పటికే 29 సార్లు పిళ్లైని విచారణకు పిలిచిన ఈడీ, పదకొండు సార్లు స్టేట్​మేంట్ రికార్డు చేసిందని అతని తరపు లాయర్​ మను శర్మ కోర్టుకు తెలిపారు. ఇన్నిసార్లు విచారణ పేరుతో తన క్లయింట్​ను మానసికంగా ఈడీ ఇబ్బంది పెడుతోందని, మరోసారి కస్టడీ కోరడం సరికాదన్నారు. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే పిళ్లై లాయర్​ కూడా విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. హోటల్ రికార్డులు చూపించి లిక్కర్ కేసును పిళ్లైకి ఆపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న జడ్జి.. పిళ్లైని మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

15న బుచ్చిబాబుతో కలిపి పిళ్లై విచారణ

ఈ నెల 15న బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరుకానున్నారు. పిళ్లైని, బుచ్చిబాబును కలిపి విచారించనుంది. లిక్కర్​ పాలసీకి సంబంధించి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను ముందుపెట్టి విచారణ జరపనుంది. ఆ రోజు వీరిద్దరూ ఇచ్చేస్టేట్మెంట్ ఆధారంగా 16న ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్నట్లు తెలిసింది.


అప్పుడెందుకు ఫిర్యాదు చేయలేదు

పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారమే పిళ్లై స్టేట్మెంట్​ను రికార్డు చేశామని ఈడీ పేర్కొంది. ‘ఒక థర్డ్ పర్సన్(కీలక వ్యక్తికి)కు నోటీసులు ఇవ్వగానే పిళ్లై తనను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. సీసీటీవీ అండ ర్​లోనే ఆయనను విచారణ జరిపాం’ అని తెలిపింది. పదిసార్లు పిళ్లై స్టేట్మెంట్ రికార్డు చేశామని, పదకొండోసారి ఈ నెల 5, 6 తేదీల్లో విచారించామని, అయితే ఇప్పుడు మాత్రమే తన స్టేట్మెంట్​ను బలవంతంగా ఈడీ రికార్డు చేసిందని పిళ్లై ఆరోపిస్తున్నారని అడ్వొకేట్లు చెప్పారు. పదిసార్లు విచారణ సందర్భంగా దీనిపై కోర్టుకు ఎందుకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నించారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా పిళ్లై ఇచ్చిన వివరాలను కన్ఫర్మ్ చేసుకున్నామని, ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారని ప్రశ్నించారు.