- లోన్ ఫ్రాడ్ కేసులో చర్యలు తీసుకున్న ఈడీ
న్యూఢిల్లీ: లోన్ ఫ్రాడ్ కేసులో భాగంగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ముంబైలోని ‘అబోడ్’ అనే లగ్జరీ ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. ముంబై పాలి హిల్‌లో ఉన్న ఈ 17 అంతస్తుల భవనం విలువ దాదాపు రూ.3,716 కోట్లు.
అనిల్ అంబానీ గురువారం రెండోసారి విచారణకు ఈడీ ముందు హాజరుకానుండగా, ముందురోజు ఆయన ఇంటిని అటాచ్ చేయడం గమనార్హం. రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) బ్యాంక్ లోన్ ఫ్రాడ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే 2025 నవంబరులో ఈ ఆస్తిలోని రూ.473 కోట్ల విలువైన భాగాన్ని అటాచ్ చేసింది. ఆర్‌కామ్, గ్రూప్ కంపెనీలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రూ.40,185 కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించలేదు.
ఈ డబ్బును పర్సనల్ అకౌంట్లకు దారి మళ్లించారని కేసు ఉంది. అబోడ్ ఇంటిని రైజ్‌ఈ ట్రస్ట్‌లో కలిపి అంబానీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి రక్షించేందుకు ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది. కాగా, లోన్ ఫ్రాడ్ కేసులో ఇప్పటివరకు జరిపిన మొత్తం అటాచ్‌మెంట్ విలువ రూ.15,700 కోట్లకు చేరింది.
